
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ అందరికీ తెగ నచ్చేసింది. ఇద్దరు స్టార్ హీరోలు నటించడం, రాజమౌళి డైరెక్షన్, అలరించే పాటలు, ఆకట్టుకునే డ్రామా, భారీ సెట్టింగ్స్ ఈ సినిమా విజయానికి కారణాలుగా నిలిచాయి. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని లాంటి ప్రముఖులు కూడా నటించడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్‌ల వసూళ్లను కురిపించింది. ఇప్పటికే ఈ మూవీ రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్‌లో పలు రికార్డులను బద్దలు కొడుతోంది. విడుదలై 40 రోజులు దాటుతున్నా వీకెండ్‌లో ఇంకా మంచి కలెక్షన్‌లను ఈ మూవీ రాబడుతోంది.
తాజాగా ఆర్.ఆర్.ఆర్ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచి జీ5వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషలకు సంబంధించి జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఈనెల 20 నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని మరో టాక్ వినిపిస్తోంది. తొలుత వారం రోజలు పాటు పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను జీ5 వారు అందుబాటులోకి తెస్తారని సమాచారం అందుతోంది. అంటే ఈ సినిమా చూడాలంటే రూ.149 చెల్లించాల్సి ఉంటుంది. రూ.149తో హెచ్‌డీ వెర్షన్‌లో ఇంటిల్లిపాదీ ఇంట్లోనే బుల్లితెరపై వీక్షించే అవకాశం కలగనుంది. ఇప్పటికే జీ5 వారు స్పైడర్ మ్యాన్ ఎవే హోమ్ సినిమాను పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేయగా మంచి స్పందన లభిస్తోంది. ఎక్కువ డబ్బులు పెట్టి థియేటర్లలో చూడని వారికి ఇలా చూడటం మంచి కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదలైన తొలి రెండు వారాల పాటు థియేటర్లలో టిక్కెట్ రేట్లు భారీగా ఉండటం వల్ల కొందరు ఈ సినిమాను చూసేందుకు ఇష్టపడలేదు. దీంతో ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేద్దామని భావించారు. తాజాగా ఓటీటీ డేట్ ఫిక్స్ కావడంతో ఈ సినిమా చూడని వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలియాభట్, ఒవిరియా మోరిస్ నటించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు. మొత్తంగా ఈ సినిమా రూ. 600 కోట్ల పైబడి షేర్ రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్‌లో రూ. 100 కోట్ల షేర్ రాబట్టి మరో రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి 2 తర్వాత ఓవర్సీస్‌లో రూ. 100 కోట్ల షేర్ రాబట్టడం మాములు విషయం కాదు. మరో తెలుగు సినిమా ఈ రేంజ్‌లో షేర్ రాబట్టడం మాములు విషయం కాదు. బాహుబలి 2 తర్వాత రూ. 604 కోట్ల షేర్ రాబట్టిన భారతీయ సినిమాగా ఆర్.ఆర్.ఆర్ మూవీ అరుదైన రికార్డును నమోదు చేసింది. 40వ రోజు కూడా రూ. 1.90 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.