
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కేఏ పాల్‌కు ఇటీవల ఊహించని పరిణామం ఎదురైంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ సిరిసిల్ల వెళ్తుండగా సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద ఆయన్ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ వాహనం దిగి కేఏ పాల్ మాట్లాడుతుండగా వాళ్లలో ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. డీఎస్పీ చూస్తుండగానే కేఏ పాల్‌పై దాడి జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పోలీసులపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. అసలు మీరు పోలీసులేనా అంటూ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు జీతాలు ప్రభుత్వం ఇస్తుందా లేదా కేటీఆర్ ఇస్తున్నాడా అని ప్రశ్నించారు. రైతుల కోసమే తాను వచ్చానని.. తాను వస్తానని చెప్తే వచ్చి తీరతానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్, కేటీఆర్ గుండాలతో పాలిస్తున్నారని కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. చాలా మంది పోలీస్ కమిషనర్లు, అధికారులు కేసీఆర్ చెప్పినట్టు పనిచేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల వెళ్తుండగా తనను అడ్డుకోవాలంటూ పోలీసులకు కేటీఆర్ కాల్ చేసి చెప్పారని.. 50 మంది పోలీసులు వచ్చి తనను ఆపారని కేఏ పాల్ ఫైరయ్యారు. తెలంగాణ హోంమంత్రి తనకు సెక్యూరిటీ ఇస్తానని హామీ ఇచ్చారని.. కానీ హైదరాబాద్ సీపీ కేఏ పాల్ ఎవడు అన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను దేనికీ భయపడే రకాన్ని కాదన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించి తీరుతానని శపథం చేశారు. దేశంలోని రైతులను అటు మోదీ ప్రభుత్వం, ఇటు కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. తనపై జరిగిన దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశానని.. అధికారులు, సీఎం కేసీఆర్‌పై హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్ వేస్తానని.. రాష్ట్రపతిని కూడా కలుస్తానని, ప్రెసిడెంట్ రూల్ కోసం ఫిర్యాదు చేస్తానని కేఏ పాల్ వెల్లడించారు.
మరోవైపు టీఆర్ఎస్ పార్టీపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో మాట్లాడానని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 28 సీట్లు కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ పెట్టమని కేసీఆరే చెప్పారని.. పార్టీ పెట్టి అన్ని పార్టీలను కలపాలని ప్రశాంత్ కిషోర్‌కు కేసీఆర్ సలహా ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని కేఏ పాల్ చెప్పారు. సిరిసిల్ల పర్యటనలో తనను కొట్టిన వ్యక్తితో పోలీసులు బ్లూ టూత్‌లో మాట్లాడారని.. ఆ తర్వాతే తనపై దాడి జరిగిందన్నారు. తెలంగాణలో పోలీసులు ప్రజల కోసం కాకుండా అధికార పార్టీ నేతల మెప్పు కోసం పనిచేస్తున్నారని కేఏ పాల్ విమర్శించారు. తాను తెలంగాణకు ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని.. తాను మళ్లీ సిరిసిల్లకు వెళ్తానని.. ఈసారి తనను చంపుతారో, అరెస్ట్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసేందుకు తాను వెళ్తుండగా తనను పోలీసులు మంగళవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఐదురోజుల్లో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే పాదయాత్ర చేపడతానని కేఏ పాల్ స్పష్టం చేశారు.