
ప్రస్తుతం టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో ఇమేజ్‌తో ముందుకు దూసుకుపోతున్నాడు. అసలే మాస్ ఇమేజ్ ఉన్న అతడికి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. దీంతో ఖండాంతరాలు దాటి ఎన్టీఆర్‌కు పాపులారిటీ పెరిగిపోయింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు స్వయంగా ఎన్టీఆర్‌ను పిలిపించుకుని అభినందించడం ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఎన్టీఆర్ సినిమాలను వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నాయి. అటు బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ఆజ్యం పోస్తున్నాయి. గతంలో తెలుగు దేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్ తాజాగా బీజేపీలో చేరబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
తొలుత ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమురం భీంగా అద్భుతంగా నటించిన ఎన్టీఆర్‌ను అభినందించడానికే అమిత్ షా పిలిపించుకున్నారని ప్రచారం జరిగింది. అయితే కొందరు ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించే మాట్లాడాలంటే రాజమౌళి, రాంచరణ్‌ను ఎందుకు పిలవలేదని ప్రశ్నలు గుప్పించారు. దీంతో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ జోరు అందుకుంది. అయితే ఎన్టీఆర్ మనసులో ఏముందో ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. కొందరు మాత్రం ప్రస్తుతం అతడు చేస్తున్న మూడు సినిమాలే చివరివి అంటూ ప్రచారం చేస్తున్నారు. కొరటాల శివతో పాటు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన, ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమాలు చేయాల్సి ఉంది. కమిట్ మెంట్ ఇచ్చిన ప్రకారం ఈ మూడు సినిమాలను పూర్తి చేసిన తర్వాతే ఎన్టీఆర్ సినిమాలకు గుడ్‌బై చెప్తాడంటూ ఫిలింనగర్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించింది. దీంతో బీజేపీ అధిష్టానం జూనియర్ ఎన్టీఆర్‌పై ఫోకస్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి,
ప్రస్తుతం సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో సెటిలైన ఆంధ్రులను ఆకర్షించడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారా అన్న చర్చ కూడా జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే సంకేతాలు ఇవ్వడం ద్వారా వారి దృష్టిని ఆకర్షించడానికి కమలనాథులు స్కెచ్ వేశారని అంటున్నారు. అటు టీడీపీని వ్యతిరేకించో లేదా సామాజిక వర్గాన్ని వ్యతిరేకించో.. ఎన్టీఆర్ తన కెరీర్‌ను పాడు చేసుకునేంత తెలివి తక్కువ వాడు కాదని.. షాతో భేటీకి గౌరవప్రదంగా పిలిచారు కాబట్టి వెళ్లారే తప్ప… అంత తేలిగ్గా టీడీపీని కాదనుకునే అవకాశమే లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. సుదీర్ఘకాలం ఉండే తన సినీ జీవితాన్ని రాజకీయాల కోసం ఎన్టీఆర్ వదులుకుంటారా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ ప్రచారాలపై ఎన్టీఆర్ స్పందిస్తే తప్ప పుకార్లకు ఫుల్‌స్టాప్ పడే అవకాశం కనిపించడం లేదు. కాగా ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటనకు గానూ ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.