
టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. అయితే ఇటీవల కాలంలో అతడి సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత పడి పడి లేచె మనసు, జాను, శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి తొలిరోజే హిట్ టాక్ వచ్చింది. తొలిరోజు కలెక్షన్స్ యావరేజ్‌గా ఉన్నా దాదాపుగా అన్ని పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమా నెమ్మదిగా పికప్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇటీవల కాలంలో దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమా కూడా నెమ్మదిగా పికప్ అయి లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో మంచి ఎమోషనల్‌గా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అమల అక్కినేని ఈ సినిమాలో శర్వానంద్ అమ్మగా నటించింది.
ఒకే ఒక జీవితం తొలిరోజు రూ.2 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి రూ.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ప్రస్తుత టాక్‌ను బట్టి చూసుకుంటే వీకెండ్ లోపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని సమాచారం అందుతోంది. ఒకే ఒక జీవితం సినిమాకు ట్రైలర్ ద్వారానే కొంత పాజిటివ్ వైబ్రేషన్ పెరిగాయి. ఈ సినిమా డిమాండ్ ను బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ థియేటర్లలోనే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నైజాంలో 120, సీడెడ్ లో 60, ఆంధ్రాలో 200 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మొత్తం ఏపీ, తెలంగాణలో చూసుకుంటే 385 థియేటర్లు , అటు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 585 థియేటర్లలో ఒకే ఒక జీవితం సినిమాను విడుదల చేశారు. నైజాంలో రూ. 2.5 కోట్లు, సీడెడ్‌లో రూ. 0.8 కోట్లు, ఆంధ్రాలో రూ.3.20 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా కథే ముఖ్యం.. దీనికోసం మేమంతా నిలబడాలంటూ దర్శకుడు శ్రీకార్తీక్ ఒత్తిడి చేశాడని హీరో శర్వానంద్ వెల్లడించాడు. తన గురించి ఇప్పుడు సినిమానే మాట్లాడుతుందన్నాడు. ఈ సినిమా చూస్తే అమ్మను చూసినట్లే ఉంటుందని.. అమ్మ పాట ఈ చిత్రానికి ఆత్మ లాంటిదని తెలిపాడు. తామంతా కష్టపడి మంచి సినిమా చేశామని పేర్కొన్నాడు. ఈ మూవీని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరాడు. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కామెడీ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. అటు తాను నటించిన పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా ఆడుతుందనుకున్నామని శర్వానంద్ చెప్పాడు. అది ఫ్లాప్ అయినప్పుడు షాక్‌లోకి వెళ్లిపోయానని.. రెండు, మూడు నెలలపాటు తన రూమ్‌లో నుంచి కూడా బయటకు రాలేదని వివరించాడు. తన అమ్మ బంగారం తీసుకుని మరీ కో అంటే కోటి సినిమా తీశామని… ఆ సినిమాకు తానే నిర్మాతను అని.. కానీ ఈ మూవీతో డబ్బులు పోయాయని చెప్పాడు. రిలేషన్స్ దూరమయ్యాయని.. ఆ విషయాన్ని తట్టుకోలేకపోయానని.. ఆ అప్పులు తీర్చేందుకు ఆరేళ్లు పట్టిందని శర్వానంద్ వెల్లడించాడు.