
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన లేటెస్ట్ మూవీ కార్తీకేయ-2. ఈ మూవీ అంచనాలను మించి రాణిస్తోంది. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ వంటి బాలీవుడ్ సినిమాలు బొక్కాబోర్లా పడిన చోట కార్తీకేయ-2 విజయకేతనం ఎగురవేసింది. కాంపిటేషన్ కారణంగా తొలుత బాలీవుడ్లో ఈ మూవీకి తగినన్ని స్క్రీన్లు కేటాయించలేదు. కానీ లాల్‌సింగ్ చద్దా, రక్షాబంధన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విఫలం కావడంతో తెలుగు సినిమా కార్తీకేయ-2కి రెండో రోజు నుంచి స్క్రీన్లు పెంచారు. తొలిరోజు హిందీ బెల్ట్‌లో ఈ మూవీకి కేవలం 60 షోలు మాత్రమే కేటాయించగా రెండోరోజు 350 షోలు కేటాయించారు. మూడోరోజు ఇండిపెండెన్స్ డే కావడంతో మరిన్ని షోలు కేటాయించారు. మూడో రోజు ఏకంగా 500కి పైగా షోలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక నాలుగో రోజు నుంచి వర్కింగ్ డేస్ ఉండటంతో బాలీవుడ్ సినిమాలను సైతం తొలగించి పలువురు థియేటర్ల యాజమాన్యాలు కార్తీకేయ మూవీకి షోలు కేటాయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద బాలీవుడ్లో 1200 షోల వరకు కేటాయించినట్లు ట్రేడ్ పండితులు వివరిస్తున్నారు. శ్రీకృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా హిందీలో రిలీజ్ చేయగా కంటెంట్ బాగుండటంతో అక్కడ షాకింగ్ రెస్సాన్స్ ఈ చిత్రానికి దక్కుతోందని చెప్పాలి. దీంతో బాలీవుడ్ సినిమాలు లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ కన్నా ఈ సినిమాకు లిమిటెడ్ గా స్క్రీన్స్ ఉన్నా కూడా వాటిని మించి బుకింగ్స్ ఈ సినిమాకు జరుగుతున్నాయి. ఇది మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో తెలుగు సినిమా సత్తా చాటినట్లు అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో పుష్ప సినిమా తెలుగు సినిమా రేంజ్ చాటి చెప్పింది. ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ సినిమా బాలీవుడ్ సినిమా రేంజ్లో వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు కార్తీకేయ-2 కూడా అంచనాలకు మించి బాలీవుడ్లో వసూళ్లు రాబడుతోంది.
సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ ఆడియెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హాలీవుడ్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. కాబట్టి హాలీవుడ్ అతి పెద్ద సంస్థగా నిలిచింది. అలాగే మన దేశంలో వచ్చేసరికి హిందీ మాట్లాడేవారు అధికం కాబట్టి హిందీ సినిమాల మార్కెట్ ఎక్కువగా ఉంటూ వచ్చింది. కానీ కొంతకాలంగా ఈ పరిస్థితిలో గణనీయంగా మార్పు వచ్చింది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో సౌత్ సినిమాలు బాలీవుడ్‌లోనూ పాగా వేశాయి. కరోనా తర్వాత బాలీవుడ్ సినిమాల్లో కంటెంట్ కరువు అవడంతో అక్కడి జనాలు సౌత్ సినిమాలపై ప్రేమను పెంచుకుంటున్నారు. పుష్ప సినిమాతో ఈ విషయం మన దర్శకులకు స్పష్టమైంది. అందుకే పాన్ ఇండియా సినిమాలను తీస్తూ కంటెంట్ బాగుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగు సినిమాలలో హిందీ జనం ఎంతో పవిత్రంగా కొలిచే హిందూ మతంపై సరైన సినిమాలు తీస్తే అక్కడ గుడి కట్టేస్తారు. ఇప్పుడు మన లేటెస్ట్ యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2 సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కార్తీకేయ-2 సినిమాను అక్కడి ప్రేక్షకులు కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో పోలుస్తున్నారు. దీంతో బాలీవుడ్‌లోనూ ఈ మూవీ సత్తా చాటుతోంది.