
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే థియేటర్ల వద్ద అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన బర్త్ డే సందర్భంగా అభిమానులు ప్రతి ఏడాది పలు సేవా కార్యక్రమాలను చేపడుతుంటారు. అయితే ఈ ఏడాది పవన్ బర్త్ డేను వినూత్నంగా నిర్వహించుకోవాలని పవర్‌స్టార్ అభిమానులు భావిస్తున్నారు. దీంతో స్పెషల్ షోలు ప్రదర్శించి వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పవన్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన జల్సా సినిమాను రీ రిలీజ్ చేయాలని తలపెట్టారు. దీంతో సెప్టెంబర్ 2న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జల్సా హడావిడి కనిపించబోతోంది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జల్సా. 2008లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు యూత్‌ను మెస్మరైజ్ చేశాయి. ఈ మూవీలో ఇలియానా, పార్వతి మెల్టన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రకాష్ రాజ్, సునీల్, ముఖేశ్ రుషి, శివాజీ, అలీ కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో వచ్చిన పాటలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్టయ్యాయి. దీంతో జల్సా మూవీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. జల్సా మూవీ రిలీజై 14 ఏళ్లు గడిచినా ఈ సినిమాలోని పాటలకు, పవన్ నటనకు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ మూవీని పవన్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ చేయాలని అభిమానులు తలపెట్టారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 500 షోలు ప్రదర్శించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంపై నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ త్వరలోనే ప్రకటన చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 700 షోలు ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 500 షోలకు పైగా ప్రదర్శించారు. ఇప్పుడు పోకిరి రికార్డును అధిగమించాలని పవర్‌స్టార్ అభిమానులు పట్టుదలతో ఉన్నారు. పోకిరి ప్రత్యేక షోలకు మంచి స్పందన లభించడంతో ఇప్పుడు జల్సా షోలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. జల్సా మూవీని కూడా పోకిరి తరహాలో అక్టోబర్ 2న 4K క్వాలిటీతో స్క్రీనింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జల్సా సినిమాలో పవన్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అటు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన వరుసగా ఓ నాలుగు సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన తమిళ సినిమా వినోదయ సీతం తెలుగు రీమేక్ కోసం ఓ 20 రోజులు కేటాయించారు. అంత అనుకుంటే ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి వెళ్లేది. కానీ పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురికావడంతో చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ తెలుగు రీమేక్‌కు కూడా సముద్రఖని దర్శకత్వం వహించనున్నాడు.