
సీనియర్ హీరో మంచు మోహన్‌బాబు తనయుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు నటించిన జిన్నా మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి తొలిరోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కెరీర్‌లో ఢీ, దేనికైనా రెడీ లాంటి హిట్లు తప్పితే మంచు విష్ణు కెరీర్‌లో విజయాలు లేవు. దీంతో జిన్నా రూపంలో మరో విజయం తన ఖాతాలో చేరుతుందని అతడు ధీమా వ్యక్తం చేశాడు. సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ వంటి హీరోయిన్‌లు ఈ సినిమాలో అందాలను ఆరబోశారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో లేదని ప్రేక్షకులు చెప్తున్నారు. దీపావళి సందర్భంగా పోటీలో ఈ సినిమాను విడుదల చేయడం కూడా మైనస్‌గా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విశ్వక్ సేన్ ఓరిదేవుడా, కార్తీ సర్ధార్, శివ కార్తీకేయన్ ప్రిన్స్ వంటి సినిమాలతో పోటీగా మంచు విష్ణు జిన్నా మూవీ విడుదల కావడంతో థియేటర్లు కూడా పరిమిత సంఖ్యలో దొరికాయి.
జిన్నా మూవీకి ఏపీ, తెలంగాణలో దొరికిన థియేటర్ల సంఖ్య చూసుకుంటే నైజాంలో 90, సీడెడ్‌లో 45, ఆంధ్రా ప్రాంతంలో 140 ఉన్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ 275 స్క్రీన్‌లలో మాత్రమే విడుదలైంది. దీంతో తొలిరోజు ఈ మూవీ రూ.50 లక్షలకు పైగా షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే జిన్నా మూవీ రూ.4.5 కోట్ల మేర రాబట్టినట్లు తెలుస్తోంది. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.5 కోట్ల మేర రాబట్టాల్సి ఉంది. తొలిరోజు రూ.50 లక్షలు రాబట్టిన ఈ చిత్రం ఇంకా రూ.4.5 కోట్ల మేర వసూలు చేయాల్సి ఉంటుంది. టాక్ పరంగా చూసుకుంటే ఇది అసాధ్యమని అనిపిస్తున్నా లాంగ్ వీకెండ్, దీపావళి ఫెస్టివల్ మంచు విష్ణును ఆదుకుంటాయేమో వేచి చూడాలి.
AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మంచు విష్ణు జిన్నా సినిమాను స్వయంగా నిర్మించాడు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మూవీని కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య డైరెక్ట్ చేయగా, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథను అందించారు. ప్రముఖ రచయిత కోనా వెంకట్ స్క్రీన్ ప్లేను అందించాడు. జిన్నా మూవీ టీజర్, ట్రైలర్ చూసి ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్ అవుతుందని ప్రేక్షకులు ఆశించారు. కానీ ప్రథమార్థం నిరాశపరిచిందని రివ్యూలు తెలియజేశాయి. జిన్నాతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టి సాలిడ్ హిట్ కొట్టాలని భావించిన విష్ణుకు ఇది ఊహించని దెబ్బే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అటు దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాలలో కార్తీ నటించిన సర్ధార్ సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కూడా కలిసొచ్చిందని ట్రేడ్ రిపోర్టులు అందిస్తున్నాయి.