
ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సీజన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే ఈ షోకు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. గత వారం నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, దర్శకులు కె.రాఘవేంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి హాజరయ్యారు. వీళ్లంతా బాలయ్యతో కలిసి చేసిన సందడి అందరినీ అలరించింది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్‌తో కలిసి ఎన్‌బీకే విత్ అన్‌స్టాపబుల్ షోకు హాజరయ్యాడు. సాధారణంగా టాక్ షోలు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే ప్రభాస్ తొలిసారి బాలయ్య షోకు హాజరుకావడం సినీ ఇండస్ట్రీలో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాకుండా ప్రభాస్ ఈ షోకు వెళ్తూ స్పెషల్‌గా కొన్ని వంటకాలను తన ఇంట్లో చేయించుకుని బాలయ్యకు తీసుకువెళ్లడంతో అభిమానులు అవాక్కవుతున్నారు.
మాములుగా ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇప్పటివరకు ఆనోట ఈనోట విన్న బాలయ్య తొలిసారి అతడి వంటకాలను టేస్ట్ చూసి మైమరిచిపోయాడు. స్టార్ హీరో బాలయ్యకు ఇష్టమైన వంటకాల వివరాలను తెలుసుకుని మరీ ఆ వంటకాలను ప్రభాస్ ప్రత్యేకంగా తయారు చేయించాడని తెలిసి బాలయ్య అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కోసం ప్రభాస్ తీసుకెళ్లిన వంటకాల జాబితాలో మటన్ బిర్యానీ, పీతల ఇగురు, చేపల పులుసు, మటన్ కర్రీ, చికెన్ సహా పప్పు, ఆవకాయ, సాంబార్ లాంటి వెజ్ వంటకాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వీటిని చూసిన బాలయ్య కడుపారా ఆరగించి ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఏదేమైనా ప్రభాస్ ఆతిథ్యం సూపర్ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఫుడ్‌తో బాలయ్యను మెప్పించిన ప్రభాస్ తన సమాధానాలతో మెప్పించాడా లేదా అని తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అటు ఈ షోలో ప్రభాస్ ధరించిన షర్ట్ కూడా అందరికీ తెగ నచ్చేసింది.
కలర్‌ఫుల్ షర్టులో ప్రభాస్ చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడని అతడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ప్రభాస్ ధరించిన షర్ట్ ఏ బ్రాండ్, దాని ధర ఎంత అనే అంశాలపై అభిమానులు వివరాలు రాబడుతున్నారు. అయితే ప్రభాస్ వేసుకున్న షర్ట్ `పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్`. దీని ధర 115 పౌండ్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 11,618 అన్న మాట. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంత సింపుల్‌గా కనిపిస్తున్న ఈ షర్ట్ ఇంత ఖరీదా అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. అటు ఈ షోలో ప్రభాస్ పెళ్లి గురించి పలు ప్రశ్నలను బాలయ్య అడిగినట్లు టాక్ నడుస్తోంది. పెళ్లి గురించి ప్రభాస్ రివీల్ కూడా చేశాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి అభిమానులంతా ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నూతన సంవత్సర కానుకగా ఈ ఎపిసోడ్ ప్రసారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడి చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కే, మారుతి సినిమాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.