
ఏపీలో నిరుపేదల కోసం గతంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్‌లను ప్రవేశపెట్టింది. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్‌ల తరహాలో ఏపీలో చంద్రబాబు అన్నా క్యాంటీన్‌లను అందుబాటులోకి తెచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరిట పెట్టిన ఈ క్యాంటీన్లు వలం రూ.5కే భోజనం అందించాయి. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలు కడుపు నిండా పేదలు భోజనం చేసేలా అప్పటి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అమల్లోకి రావడంతో అన్నా క్యాంటీన్‌లు మూతపడ్డాయి. పలు చోట్ల అన్నా క్యాంటీన్‌లను ప్రభుత్వం కూల్చివేసింది. మరికొన్ని చోట్ల అన్నా క్యాంటీన్‌లను సచివాలయాలుగా మార్చారు. అయితే మరో రెండేళ్లలో ఎన్నికలు రానుండటంతో టీడీపీ ప్రభుత్వం సొంత నిధులతో అన్నా క్యాంటీన్‌లను నడిపేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ నిధులతో అన్నా క్యాంటీన్‌లు పెట్టాలని టీడీపీ ముందడుగు వేసింది.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నా క్యాంటీన్‌లను ప్రారంభించే బాధ్యత తీసుకున్నారు. తొలుత గుంటూరులో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించేలా ఆయన చర్యలు తీసుకున్నారు. రూ.5కి కాకుండా రూ.2కే అన్నా క్యాంటీన్‌లో భోజనం అందిస్తామని బాలయ్య ప్రకటించారు. దీంతో స్థానికంగా ఉండే పేదలకు, కార్మికులకు ఊరట కలిగినట్లు అయ్యింది. గుంటూరు జేకేసీ రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను బాలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై అన్ని చోట్ల తిరుగుబాటు వస్తోందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వంపై ఉద్యమించాలని ప్రజలకు బాలయ్య పిలుపునిచ్చారు. వైసీపీ సర్కారు మూసివేసిన అన్నా క్యాంటీన్‌లను త్వరలో రాష్ట్రమంతా ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా అన్నా క్యాంటీన్ల ద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మైలేజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జిల్లాకు ఒకటి చొప్పున టీడీపీ అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు క్యాంటీన్‌లను ప్రారంభించేందుకు అవసరమైన స్థలం, బిల్డింగ్ లను వెతికే పనిలో టీడీపీ అధికారులు నిమగ్నమయ్యారు.
ఒకవేళ అన్నా క్యాంటీన్ల నిర్వహణకు స్థలాలు, బిల్డింగ్‌లు దొరకకపోతే జిల్లా కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే వీటిని ప్రారంభించాలని డిసైడ్ అయ్యారట. ఇక ఈ క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరుల పైన ఆ పార్టీ దృష్టిపెట్టింది. దీనికి విరాళాలు ఏవిధంగా సేకరించాలి, ఎవరికి వీటి నిర్వహణ బాధ్యతను అప్పగించాలనే విషయాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ముందుకు వచ్చే వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఇప్పటికే ఎన్నారై టీడీపీ విభాగం కూడా ప్రకటించడంతో వీటి ఏర్పాటుపై కసరత్తు మొదలు పెట్టారు. మరోవైపు గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ కూడలిలో టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నాక్యాంటీన్‌ను ఇటీవల ప్రారంభించారు. టీడీపీ ఎన్నారై విభాగం, నందమూరి బాలకృష్ణ అభిమానులు అందించిన ఆర్థిక సాయంతో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. గతంలో అన్న క్యాంటీన్‌లో మాదిరే ఈ క్యాంటీన్‌లోనూ రూ.5లకే భోజనాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ క్యాంటీన్‌ను ప్రారంభించినట్లు వారు తెలిపారు.