
కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరో కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార టాలీవుడ్‌లో రికార్డుల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సత్తా చాటుతుండటంతో తెలుగు సినిమాలు కూడా భయపడుతున్నాయి. చిరంజీవి గాడ్ ఫాదర్ సైతం కాంతార వల్ల నష్టపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో తొలిరోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ తొలి మూడు రోజుల్లో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచేలా వసూళ్లను సొంతం చేసుకుంది. తొలి మూడు రోజుల్లో ఈ మూవీ రూ.8 కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం రూ.2 కోట్ల ప్రీ రిలీజ్ మాత్రమే ఈ మూవీకి జరిగింది. అయితే వీకెండ్‌లోనే లాభాల బాట పట్టి ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది. దీంతో అల్లు అరవింద్ ఫిచ్చ హ్యాపీలో కనిపిస్తున్నారు.
కాంతార మూవీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో తొలిరోజు రూ.2.10 కోట్ల షేర్, రెండో రోజు రూ.2.8కోట్ల షేర్, మూడో రోజు రూ.1.5 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. మూడురోజులకు నైజాంలో ఈ మూవీ రూ.2.9 కోట్లు, సీడెడ్‌లో రూ.90 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.85 లక్షలు , తూర్పుగోదావరిలో రూ.60 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.40 లక్షలు, గుంటూరులో రూ.50 లక్షలు, కృష్ణాలో రూ.40 లక్షలు, నెల్లూరులో రూ.30లక్షల షేర్ వసూళ్లను సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. ప్రాంతాలు, భాషా బేదం లేకుండా ఈ మూవీకి భారీగా మౌత్ టాక్ రావడంతో తెలుగు,తమిళం, హిందీలలో డబ్ చేసి ఈనెల 15న విడుదల చేశారు. కేజీఎఫ్ మూవీని నిర్మించిన బ్యానర్ హోంబలే మూవీస్ పతాకంపై రిషబ్ శెట్టి, సప్తమి గౌడ నటించిన కాంతార మూవీపై అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రం ఈ రేంజ్ వసూళ్లను సాధించిన దాఖలాలు లేవని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కాంతార అంటే తెలుగులో అడవి అని అర్ధం. సినిమా టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ మూవీ అంతా అడవిలోనే చిత్రీకరించారు. అడవి, నది, చెట్టు, మొక్క లేకుండా ఈ సినిమా లేదంటే అతిశయోక్తి లేదు. ఈ మూవీ సక్సెస్‌పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్‌స్టార్స్, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ వంటివి మాత్రమే ప్రేక్షకులను సినిమా థియేటర్‌కు రప్పిస్తాయని అందరూ అభిప్రాయపడుతున్న వేళ ఎలాంటి అగ్రతారాగణం లేకుండా తెరకెక్కిన కాంతార మూవీ భారీ చిత్రాల రికార్డులను సైతం కొల్లగొడుతుండటం గొప్ప విషయమని వర్మ అభిప్రాయపడ్డాడు. అటు ఐఎండీబీలో ఈసినిమాకు 9.5రేటింగ్ లభించడం విశేషం. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఏడాది తెలుగులో క్లీన్ హిట్ సాధించిన 14వ సినిమాగా కాంతార నిలిచిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.