
టాలీవుడ్ యువహీరో అడివిశేష్ నటించిన కొత్త సినిమా హిట్-2. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని ఈ సినిమాను నిర్మించాడు. గతంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్-1 మూవీకి ఇది సీక్వెల్. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ తొలిరోజే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండుతోంది. బింబిసార, సీతారామం, కార్తీకేయ-2 తర్వాత టాలీవుడ్‌లో మంచి సినిమా రాలేదు. ఊర్వశివో రాక్షసివో, యశోద వంటి సినిమాలకు మంచి రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయాయి. దీంతో మంచి అంచనాలతో విడుదలైన హిట్ 2 మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది.హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ కొలను.. హిట్ 2 చిత్రానికి దర్శకత్వం వహించి.. పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అయ్యాడు. రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ ఈ మూవీలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ ఈ మూవీలో విలన్ పాత్రలో రాణించాడు.
ఈ మూవీ ఏపీ, తెలంగాణలో కలిపి 550కి పైగా థియేటర్లలో విడుదలైంది. నైజాంలో 210, సీడెడ్‌లో 90, ఆంధ్రాలో 250కి పైగా థియేటర్లలో హిట్ 2 మూవీని విడుదల చేశారు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 85 థియేటర్లు, ఓవర్సీస్‌లో320 థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 955 థియేటర్లలో ఈ మూవీ స్క్రీనింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.14.5 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో రూ.15కోట్లు వసూలు చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ రావడంతో తొలి మూడు రోజుల్లోనే హిట్ 2 మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్‌తో కలిసి నిర్మాత నాని, హీరో అడివి శేష్ సక్సెస్ సంబరాలు చేసుకున్నారు.
అడివి శేష్ నటన హిట్2 మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అందరూ అంటున్నారు. ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న అడివి శేష్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డా ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే కథలు రాసుకుంటూ వరుసగా హిట్‌లను అందుకుంటున్నాడు. హిట్ 2 కథ విషయానికి వస్తే హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్‌ను చేధించాడు అనేది థ్రిల్లింగ్‌గా చూపించారు. దీనికి తోడు సౌండ్, పిశ్చర్ అదిరిపోయింది. సినిమా హిట్ అని అంటున్నారు నెటిజన్స్. ఈ చిత్రానికి ఎంఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఓటీటీ హక్కుల విషయానికి వస్తే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. హిట్ 1 మూవీ హక్కులను కూడా ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసింది. హిట్ 2 విడుదలైన 8 వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు A సర్ఠిఫికేట్ జారీ చేశారు. ఈ చిత్రం రన్‌టైమ్ కూడా తక్కువేనని తెలుస్తోంది. హిట్ 2కి సీక్వెల్‌గా త్వరలో హిట్ 3 కూడా రాబోతున్నట్లు ఈ చిత్రంలో హింట్ ఇచ్చారు. అందులో నిర్మాత నాని కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.