
ప్రస్తుతం టాలీవుడ్‌లో పాత సినిమాల హడావిడి నెలకొంది. ఇటీవల మహేష్ పోకిరి సినిమా స్పెషల్ షోలు టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేశాయి. ముఖ్యంగా 470 షోలు ప్రదర్శించడంతో భారీ వసూళ్లు వచ్చాయి. దీంతో అగ్రహీరోల పాత సినిమాలు మళ్లీ రీ రిలీజ్‌కు ముస్తాబు అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు జల్సా సినిమాను రీ రిలీజ్ చేయగా ఏకంగా 700కి పైగా షోలను ప్రదర్శించారు. అంతేకాకుండా తమ్ముడు సినిమాను కూడా ప్రదర్శించారు. అయితే తమ్ముడు సినిమా షోలను లిమిటెడ్‌గానే ప్రదర్శించారు. తాజాగా బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాను కూడా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా షోలు ప్రదర్శించగా నందమూరి అభిమానులు పోటెత్తారు. ఆయా ప్రత్యేక షోలను ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఖుషి సినిమా కూడా రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 31న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తామని ప్రకటన చేశారు. హీరోగా పవన్ నటించిన ఏడో సినిమాగా ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. యూత్‌లో పవర్‌స్టార్‌కు క్రేజ్ తెచ్చిన సినిమాగా నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, డైలాగ్స్, డ్యాన్సులు, మేనరిజమ్స్, యాటిట్యూడ్ కుర్రకారుకి పిచ్చపిచ్చగా నచ్చేశాయి. ఇప్పటికీ ఖుషి సినిమా చాలామందికి ఫేవరెట్. టీవీలో టెలికాస్ట్ అవుతున్నా సరే మిస్ కాకుండా చూస్తుంటారు. ఈ మూవీలో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మణిశర్మ సంగీతం సమకూర్చిన అన్ని పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు ఖుషి మూవీ సిద్ధమవుతోంది. ఆల్ట్రా 4కే హెచ్‌డీ, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
తమిళనాడులో అజిత్ నటించిన వాలి మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అయిన ఎస్.జె.సూర్యని టాలీవుడ్‌కి పరిచయం చేస్తూ శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్ మీద అగ్రనిర్మాత ఏఎమ్ రత్నం ఈ మూవీని భారీస్థాయిలో నిర్మించారు. ఖుషి సినిమాలో పవన్ సరసన భూమిక హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ కుర్రకారును ఉర్రూతలూగించింది. భూమిక నడుమును చూసే సీన్ అందరికీ నచ్చేసింది. ఈ సీన్‌పై చాలా సినిమాల్లో స్పూఫ్‌లు కూడా వచ్చాయి. ఈ మూవీ రీ రిలీజ్ కోసం స్పెషల్ అకేషన్‌ను మేకర్స్ సెలక్ట్ చేసుకున్నారు. కొత్త సంవత్సర సంబరాలలో ఖుషి సినిమాను ప్రదర్శిస్తే అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించి డిసెంబర్ 31వ తేదీని లాక్ చేశారు. కాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఘరానా మొగుడు సినిమాను ప్రదర్శించగా అంతంత మాత్రంగానే స్పందన లభించింది. కానీ ఇటీవల ధనుష్ నటించిన 3 సినిమాను రీ రిలీజ్ చేయగా మంచి వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.