
జబర్దస్త్ షోతో పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. ఈ క్రేజ్‌తో పలు సినిమా అవకాశాలను కూడా హైపర్ ఆది సంపాదించాడు. ఇటీవల రవితేజ ధమాకాలోనూ సందడి చేశాడు. అయితే హైపర్ ఆది బేసిక్‌గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈ విషయం అతడి స్కిట్లలోనూ స్పష్టం అవుతుంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన నిర్వహించిన సభలో హైపర్ ఆది వైసీపీ మంత్రులపై పంచ్‌లు వేశాడు. చాలా మంత్రులకు వాళ్ల శాఖలు కూడా తెలియవంటూ చురకలు అంటించాడు. అంతేకాకుండా మంత్రులు ఆ శాఖ.. ఈ శాఖ కాకుండా పవన్ కళ్యాణ్‌ను తిట్టేందుకు ఓ శాఖ పెట్టుకోవాలన్నాడు. అటు పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ప్రతి ఒక్కరికీ ఒక గోల్ ఉంటుందని.. తనకు పవన్‌ను సీఎంగా చూడాలనే గోల్ ఉందని హైపర్ ఆది స్పష్టం చేశాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశాడు. అయితే హైపర్ ఆది వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్మీ పేరిట ఉన్న ఓ సోషల్ మీడియా హైపర్ ఆదిని టార్గెట్ చేసింది. ఇందులో హైపర్ ఆదికి డైపర్ వేయాల్సిన టైమ్ వచ్చిందంటూ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
అటు హైపర్ ఆదికి మంత్రి రోజా కూడా కౌంటర్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ అంటే భయంతో కొందరు చిన్న చిన్న నటులు ఆ కుటుంబంతో ఉంటున్నారు తప్ప ప్రేమతో ఎవరూ లేరని రోజా అన్నారు. టీవీ షోలు, సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటున్నారని.. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండాపోతాయని భయంతో మాట్లాడుతున్నారని రోజా అభిప్రాయపడ్డారు. నిజంగా మెగా ఫ్యామిలీ అంటే ప్రేమ ఉంటే మా అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని అన్నారు. భయం వేరు.. ప్రేమ వేరు అని రోజా చెప్పుకొచ్చారు. అయితే ఎవరైతే మంత్రుల గురించి మాట్లాడారో వాళ్లు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాలని సూచించారు. మంత్రులకు శాఖలే తెలియదని కొందరు అన్నారని.. శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారా అని రోజా ప్రశ్నించారు. కొంతమందికి ఏం తెలియదు కాబట్టే జనాలు ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించలేదని పవన్‌ను ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు చేశారు.
అటు సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అని రోజా అన్నారు. సినిమా నటుల్లో కొంతమందికి క్రేజ్ ఉన్నా రాజకీయాల్లో రాణించలేకపోయారని గుర్తుచేశారు. కానీ సినిమాల నుంచి వచ్చిన కోట శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచారని.. శారద గారు గెలిచారని.. తాను కూడా గెలిచానని రోజా చెప్పుకొచ్చారు. కానీ కొంతమంది రెండు చోట్ల పోటీ చేసినా ప్రజలు గెలిపించలేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి వాళ్లు స్టేజీలు ఎక్కి పిచ్చిగా మాట్లాడటం.. చిన్న చిన్న ఆర్టిస్టులను పెట్టుకుని ఏదంటే అది మాట్లాడించి ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల వరకు బాగుంటే చూస్తారని.. ఎంజాయ్ చేస్తారని.. కథ బాగుంటే హిట్ చేస్తారని.. కథ బాగోలేందటే ఫ్లాప్ చేస్తారని రోజా చెప్పారు. కానీ పాలిటిక్స్‌లో మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఏదో ఫాలోయింగ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని వార్నింగ్ ఇచ్చారు.