
హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. అతడు వేసే పంచ్‌లు టపాసుల తరహాలో పేలుతూనే ఉంటాయి. కేవలం హైపర్ ఆది కోసమే జబర్దస్త్ చూసే వాళ్లు చాలామందే ఉన్నారు. మాట మాటకు పంచ్ విసురుతూ రచ్చ చేయడం ఆదికి వెన్నతో పెట్టిన విద్య. అమ్మాయి కనిపిస్తే చాలు రొమాంటిక్ బాణాలతో కుడి పంచులు విసరడం అతడి స్పెషాలిటీ అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం హైపర్ ఆది మల్లెమాల సంస్థ నిర్వహిస్తున్న మరో షోలోనూ పాల్గొంటున్నాడు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ హైపర్ ఆది సందడి చేస్తున్నాడు. ఇందులో కూడా అతడు తనదైన పంచ్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో షో ప్రొమోలో హైపర్ ఆదిని చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఎప్పుడూ తన కామెడీతో కంటెస్టెంట్లను ఆటపట్టించే ఆదికి షాకిచ్చారు తోటి కమెడియన్స్. అందరూ కలిసి స్టేజ్ పైనే అతడికి గుండు కొట్టించారు.
శ్రీదేవి డ్రామా కంపెనీలో షోలో ఈ వారం చదివింపులు అనే టాస్క్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొన్ని నంబర్లను ఇచ్చారు. ఆ నంబర్లు సెలక్ట్ చేసుకుంటే వాటి వెనుక కొన్ని స్కిట్లు ఉంటాయి. హైపర్ ఆది కూడా ఓ నంబర్ సెలక్ట్ చేసుకున్నాడు. దాని వెనక ఏముంటే అది చేయాలని యాంకర్ రష్మి చెప్పింది. ఇందులో భాగంగా ఆది 9 నంబర్ సెలక్ట్ చేసుకున్నారు. అందులో ఒకరికి 30 సెకన్లు ముద్దు పెట్టాలి అని వచ్చింది. జబర్దస్త్ ఐశ్వర్యను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించగా.. నరేష్ మధ్యలోకి వచ్చేసి ఇవన్నీ కావాలని పెట్టుకున్నావు కానీ.. వేరే నంబర్ ట్రై చేయ్ అనడంతో వెనక్కు తగ్గాడు. ఆ తర్వాత 11 నంబర్ సెలెక్ట్ చేసుకోగా.. అందులో గుండు కొట్టించుకోవాలి అని ఉంటుంది. ఆదిని అందరూ పట్టుకుని స్టేజ్ పైనే గుండు కొట్టించేశారు. జడ్జి ఇంద్రజ ఇంతలో కల్పించుకుని ఆగండి.. ఆయనకు ఎన్ని కమిట్‌మెంట్లు ఉంటాయో అని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ టాస్క్ అంటే టాస్కే అంటూ బుల్లెట్ భాస్కర్ సహా ఇతర కంటెస్టెంట్లు ఇంద్రజ మాట వినకుండా హైపర్ ఆదికి గుండు కొట్టేశారు.
అయితే హైపర్ ఆదికి గుండుకొట్టడం చూసి సెట్లో ఉన్నవాళ్లంతా షాకయ్యారు. ఆది తలపై టవల్ కప్పుకుని కోపంగా బయటకు వెళ్లిపోతాడు. దీంతో ఈ షో వాళ్లు టీఆర్పీ కోసం తనకు గుండు కొట్టారంటూ ఆది కస్సుబస్సులాడాడు. టీఆర్పీ రేటింగ్‌ల కోసం ఇలా చేయడం సరికాదని హితవు పలికాడు. అయితే ఆదికి నిజంగా గుండు కొట్టలేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇదంతా జిమ్మిక్కులు అని మండిపడుతున్నారు. అసలు ఆదికి నిజంగా గుండు కొట్టారో లేదో తెలియాలంటే ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ చూడాల్సిందే. బబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల నుంచి సుడిగాలి సుధీర్ వెళ్ళిపోయిన తర్వాత హైపర్ ఆది మెయిన్ అట్రాక్షన్ అవుతున్నాడు. ప్రతి వారం షో ఇంట్రెస్టింగ్‌గా మార్చడం కోసం కొత్తగా స్కిట్స్ చేస్తున్నారు. టీఆర్పీ కోసం కొన్ని జిమ్మిక్కులు కూడా చేస్తున్నారు. అయితే ఎవరికో గుండు చేసి హైపర్ ఆదిలా కలరింగ్ ఇచ్చారని నెటిజన్‌లు అంటున్నారు. ఎందుకంటే గుండు చేశాక ఆది ముఖం స్పష్టంగా చూపించలేదు. అటు బుల్లితెరపై మాత్రమే కాదు వెండితెరపై కూడా హైపర్ ఆది బిజీ కమెడియన్ అయిపోయాడు. చాలా సినిమాల్లో హీరో స్నేహితుడి పాత్రలో ఆది కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.