
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన అతడు ఆ తర్వాత వరుస హిట్లతో ప్రామిసింగ్ హీరోగా మారాడు. ఇప్పుడు నిఖిల్ వరుసగా పెద్ద బ్యానర్‌లలో నటిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి నిఖిల్ నివాసంలో విషాదం నెలకొంది. ఇటీవల నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. దీంతో తన జీవితంలో కోలుకోలేని దెబ్బ పడిందని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మరణవార్త అనంతరం ఓ ఫోటోను అభిమానులకు షేర్ చేస్తూ నిఖిల్ భావోద్వేగానికి గురయ్యాడు. తమకు మంచి జీవితం అందించడానికి తన తండ్రి ఎంతో కష్టపడ్డారని.. తమతో గడిపేందుకు 8 ఏళ్ల నుంచి వ్యాధితో కోలుకునేందుకు పోరాటం చేశారని నిఖిల్ చెప్పుకొచ్చాడు. తన తండ్రి మరణంతో తాను కుంగిపోయానని తెలిపాడు. తన తండ్రి ఎంతో మంది విద్యార్థులకు చదువు అందించారని నిఖిల్ వివరించాడు. మరెంతో మందికి మార్గనిర్దేశం చేశారని కూడా చెప్పుకొచ్చాడు.
ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ చేసిన తండ్రి జేఎన్టీయూ నుంచి స్టేట్ టాపర్‌గా నిలిచినట్లు వెల్లడించాడు. ఇప్పటికీ హార్డ్ వర్క్ చేస్తుంటారని.. కానీ అనూహ్య్గంగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారని నిఖిల్ కన్నీటిపర్యంతం అయ్యడు, తన చుట్టూ ఉన్నవాళ్లను ఎప్పుడూ సంతోషపెట్టేందుకే ఆయన ప్రయత్నించారని.. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌లకు వీరాభిమాని అని పేర్కొన్నాడు. వాళ్లలాగే తాను ఓ పెద్దనటుడు కావాలని తన తండ్రి ఆకాంక్షించారని.. ఆయన మద్దతు వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపాడు. నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. శ్యామ్ సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. 18 పేజీస్, కార్తీకేయ-2, స్పై మూవీస్‌లలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. వీటిలో 18 పేజీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. అటు కార్తీకేయ-2 షూటింగ్‌లో నిఖిల్ పాల్గొంటున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
కాగా 2020 నుంచి నిఖిల్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. 2019లో చివరగా నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా విడుదలైంది. కరోనా కారణంగా అతడి కెరీర్‌లో బిగ్ బ్రేక్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే నిఖిల్‌కు సాలిడ్ హిట్ తగిలి చాలా కాలమే అవుతోంది. కరెక్టుగా చెప్పాలంటే 2014లో రిలీజైన కార్తీకేయ తర్వాత 2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత.. మళ్లీ ఇంతవరకు అంతటి సక్సెస్ దక్కలేదు. అందుకే మళ్లీ కార్తీకేయ-2 సినిమాను నమ్ముకుని సీక్వెల్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. జూలై 22న విడుదలయ్యేలా కార్తీకేయ2 మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. హీరో నిఖిల్ కెరీర్ గ్రాఫ్ చూస్తే.. ఎక్కువ ఫ్లాప్స్ కనిపిస్తాయి. కానీ సినిమాకో కొత్త వేరియేషన్ ట్రై చేయడం నిఖిల్‌కు అలవాటు. అయితే సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కేశవ వంటి ప్రయోగాలు కలిసిరాలేదు. అందుకే ఈసారి లేట్ అయినా కార్తీకేయ2, 18 పేజీస్ వంటి డిఫరెంట్ సబ్జెక్టులతో ఆకట్టుకుంటానని గట్టి పట్టుదలతో ఉన్నాడు. 18 పేజీస్ మూవీకి డైరెక్టర్ సుకుమార్ కథ అందించాడు. ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి సకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించింది.