
టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలనటుడిగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి చిన్నప్పుడే క్రేజ్ సంపాదించుకున్న మహేష్.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన రాజకుమారుడు సినిమాతో హీరోగా రంగప్రవేశం చేశాడు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యింది. అనంతరం యువరాజు, మురారి లాంటి సినిమాలతో తనకంటూ మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. దీంతో అతడి సినిమాలు విడుదలైతే చాలు థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం మాములుగా ఉండేది కాదు. అయితే ఓ ఏడాది మహేష్‌బాబు సినిమాతో మరో బాలనటుడు హీరోగా పరిచయం అయిన సినిమా పోటీ పడింది. ఆ బాలనటుడు ఎవరో కాదు తరుణ్. అతడు కూడా బాలనటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బాలయ్య ఆదిత్య 369 లాంటి సినిమాల్లో నటించి మార్కులు కొట్టేశాడు.
ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో మహేష్‌బాబు నటించిన వంశీ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 9న విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రస్తుతం మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ నటించింది. ఈ మూవీతోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వంశీ మూవీ భారీ అంచనాలతో విడుదలైంది. పద్మాలయ స్టూడియోస్ బ్యానరుపై తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. రూ.5 కోట్లతో నిర్మించిన ఈ మూవీ కేవలం రూ.3 కోట్లు మాత్రమే రాబట్టి నష్టాలను మూటగట్టుకుంది. ఈ సినిమాను యాక్షన్ ఫిలింస్ డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించాడు. మరోవైపు తరుణ్ తొలిసారి హీరోగా నటించిన నువ్వేకావాలి సినిమా మహేష్ సినిమాతో పోటీగా విడుదలైంది. 2000 అక్టోబర్ 13న విడుదలైన నువ్వేకావాలి మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను కేవలం రూ.1.2 కోట్లతో నిర్మించగా రూ.24 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్, స్రవంతి మూవీస్ సంయుక్తంగా నిర్మించిన నువ్వే కావాలి సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ మూవీ చాలా థియేటర్లలో ఏడాదికి పైగా ప్రదర్శితమైంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓడియన్ థియేటర్‌లో ఈ మూవీ 260 రోజులు ప్రదర్శితమైంది. ఓ డెబ్యూ హీరో స్టార్ హీరోతో పోటీపడి ఈ రేంజ్‌లో కలెక్షన్స్ సాధించడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. రిచా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ స్నేహం, ప్రేమ నేపథ్యంగా తెరకెక్కింది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా రామోజీరావు ఈ మూవీని నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించారు. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే ప్రేక్షకులు వదిలిపెట్టకుండా వీక్షిస్తుంటారు. ఈ మూవీతో తరుణ్ ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. నువ్వే కావాలి తర్వాత అతడికి వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే విజయాలు సాధించాయి. విచిత్రం ఏంటంటే.. ప్రస్తుతం తరుణ్ జీరో అయ్యాడు. మహేష్ మాత్రం తన హవా ఇంకా చూపిస్తున్నాడు.