
టాలీవుడ్ దివంగత హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రస్తుతం జీవించి లేకపోయినా అభిమానుల మనసులో మాత్రం గూడుకట్టుకుంది. తెలుగింటి ఆడపడుచులా తన నటన, తన అభినయంతో ఎందరో ప్రేక్షకుల హృదయాలను సౌందర్య గెలుచుకుంది. ముఖ్యంగా టాలీవుడ్లో అగ్ర హీరోలందరి సరసన నటించింది. మీడియం రేంజ్ హీరోలతోనూ ఆడిపాడింది. విక్టరీ వెంకటేష్, జగపతిబాబుతో ఎక్కువ సినిమాల్లో నటించింది. ఒక దశలో జగపతిబాబుతో సౌందర్యకు ఎఫైర్ ఉందని పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఆ విషయాలపై సౌందర్య ఎప్పుడూ స్పందించలేదు. తన సినిమాలతో తాను బిజీగా ఉండేది. కానీ తాజాగా సౌందర్యతో ఎఫైర్ వార్తపై జగపతిబాబు స్పందించాడు. సౌందర్యతో ఎఫైర్ ఉందన్న మాట నిజమేనని జగపతిబాబు క్లారిటీ ఇచ్చాడు. అయితే అందరూ అనుకునే ఎఫైర్ కాదని.. ఆమె తనకు మంచి స్నేహితురాలు అని తెలిపాడు. సౌందర్య అన్నయ్య కూడా తనకు మంచి ఫ్రెండ్ అని.. అలాగే తమ రెండు ఫ్యామిలీలు చాలా క్లోజ్‌గా ఉండేవని చెప్పాడు.
కానీ సౌందర్యతో తనకు ఎఫైర్ ఉందని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నా.. తమ రెండు కుటుంబాలు తమను అర్థం చేసుకున్నాయని జగపతిబాబు వివరించాడు. అయితే ప్రస్తుతం సౌందర్య లేకపోవడం ఎంతో బాధాకరమని.. ఆ బాధను ఎవరు తీర్చలేనిది అంటూ జగపతిబాబు తెలిపాడు. జగపతిబాబు, సౌందర్య కలిసి దాదాపు 10 సినిమాల్లో నటించారు. దొంగాట, పెళ్లిపీటలు, సర్దుకుపోదాం రండి, మూడు ముక్కలాట, అల్లరి ప్రేమికుడు, భలే బుల్లోడు, ప్రియరాగాలు, చిలకపచ్చనికాపురం, అంత:పురం వంటి హిట్ సినిమాల్లో వీళ్ల కాంబినేషన్ నటించింది. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ మీద జగపతిబాబు, సౌందర్య జంట చూడముచ్చటగా కనిపించేది. ఏ విషయమైనా సౌందర్యతో తాను షేర్ చేసుకునే వాడినని.. ఎఫైర్ అంటే అర్థం రిలేషన్షిప్ అని జగపతిబాబు అన్నాడు. ఈ మధ్యకాలంలో ఏ ఇద్దరు కలిసి తిరిగినా, మాట్లాడుకున్నా ఇలాంటి పుకార్లు తప్పవని, వీటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదన్నాడు.
కాగా 1990 కాలంలో హీరోలలో అందరికంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న స్టార్ హీరో ఎవరంటే జగపతిబాబు అనే చెప్పాలి. ఎంతోమంది ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరోగా టాలీవుడ్లో జగపతిబాబు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించిన ఆయన సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు విలన్‌గా దూసుకుపోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమా ద్వారా విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా జగపతిబాబు కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. లెజెండ్ తర్వాత వరుసగా శ్రీమంతుడు, కరెంట్ తీగ, జయ జానకి నాయక, నాన్నకు ప్రేమతో వంటి సినిమాల్లో అవకాశాలు రావడంతో జగపతిబాబు దశ తిరిగిపోయింది. దాదాపు ఇప్పుడు ప్రతి సినిమాలో జగపతిబాబు ఉండాల్సిందే అన్న రేంజ్‌కు చేరుకున్నాడు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లలోనూ జగపతిబాబు రాణిస్తున్నాడు.