
ఇటీవల కాలంలో సెల్ఫీలు కామన్ అయిపోయాయి. అందరి దగ్గర సెల్ ఫోన్‌లు ఉండటంతో సెల్ఫీల రాజ్యం నడుస్తోంది. అందుకే సెలబ్రిటీ కనిపించినా.. ఫ్రెండ్‌ను కలిసినా.. సన్నిహితులతో సమావేశమైనా సెల్ఫీలు తీసుకుంటూ అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే సెల్ఫీలను దుర్వినియోగం చేస్తున్న వారు కూడా ఉన్నారనుకోండి అది వేరే విషయం. కానీ సెల్ఫీల పేరుతో కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీంతో బండ బూతులు తిట్టించుకుని అవమానం పాలవుతున్నారు. తాజాగా ఓ యువకుడు జిమ్‌లో నుంచి వెళ్తున్న హీరోయిన్ పూజా హెగ్డేను సెల్ఫీ అడిగాడు. ముచ్చటపడి అడిగాడు కదా కాదని చెప్పడం దేనికంటూ పూజా హెగ్డే కూడా సెల్ఫీ దిగేందుకు అంగీకరించింది. అయితే యువకుడు దీనిని అడ్వాంటేజ్ తీసుకుని పూజా హెగ్డేను ముట్టుకోవడానికి ట్రై చేశాడు. అంతే ఆమెకు చిర్రుమని కోపం వచ్చింది. దీంతో పూజా హెగ్డే ఆ యువకుడిని తిట్టి అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయింది.
ఈ తతంగం అంతా ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. హీరోయిన్ పూజా హెగ్డే ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తుంటుంది. అందుకే ఆమె ఖాళీ దొరికితే జిమ్‌లో గడిపేందుకు ఇష్టపడుతుంది. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ముకుంద సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ హిందీ ఇండస్ట్రీల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే పూజా హెగ్డే నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, ఎఫ్ 2 సినిమాలు విడుదలై ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఎఫ్ 2 సినిమాలో పూజా చేసిన ఐటెం సాంగ్ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
మరోవైపు పూజా హెగ్డే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటుంది. ఫ్యామిలీతో సరదగా గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే పూజా హెగ్డేకు ఈ మధ్యకాలంలో వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి. అయితే అవేమీ ఆమె సినీ కెరీర్‌ను ప్రభావితం చేయలేదు. పూజా పలు సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. ఒకప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి సినిమాల్లో నటించిన ఈ భామ.. ఇప్పుడు చాలా మంది హీరోల సినిమాలు రిజెక్ట్ చేస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్‌లో కూడా హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా నుంచి పూజా హెగ్డే నిష్క్రమించినట్లు తెలుస్తోంది. ఎప్పుడు మొదలుకానుందో తెలియని ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె డేట్‌లను బ్లాక్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ సరసన పూరీ జగన్నాథ్ జన గణ మనలో పూజా హెగ్డే నటించబోతోంది. ఈ కారణాల వల్ల పవన్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు డేట్స్ సర్దుబాటు చేయలేక పూజా తప్పుకుందని టాక్ నడుస్తోంది.