
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోయిన్‌లలో కాజల్ అగర్వాల్ తప్పకుండా ఉంటుంది. అయితే ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఎంతో మంది హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమవుతుంటారు. తమ కుటుంబాలను చూసుకోవడం కోసం వారు సినీ కెరీర్‌కు ముగింపు పలుకుతారు. పిల్లలు పెద్దయిన తర్వాత అవకాశాలు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కూడా ఇప్పుడు అదే బాటలో ఉంది. వివాహం చేసుకున్న తర్వాత అడపా దడపా సినిమాలు చేస్తున్న కాజల్ ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆమె బిడ్డ అని తెలుస్తోంది. ఇటీవల కాజల్ నీల్ కిచ్లూ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇకపై తన కుమారుడికే మొత్తం సమయాన్ని కేటాయించాలని కాజల్ భావిస్తోంది. ఒకవేళ సినిమాలలో నటిస్తే కొడుకుని చూసుకోవడానికి సమయం ఉండదనే ఆలోచనతో కాజల్ అగర్వాల్ పూర్తిగా సినిమాలకు దూరం కావాలనే నిర్ణయానికి వచ్చిందని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తతో కాజల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటి ఇకపై నటించబోదనే వార్త వారికి రుచించడం లేదు. కాజల్ తన అభిప్రాయాన్ని మార్చుకుని సినిమాల్లో కొనసాగుతుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే కాజల్‌కు ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయి. కానీ తాజా నిర్ణయంతో ఇప్పటికే అగ్రిమెంట్ చేసిన ప్రాజెక్ట్‌లను కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాజల్ ప్రస్తుతం నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రెండు తమిళ సినిమాలు ఉండగా ఓ బాలీవుడ్ మూవీ ఉంది. అటు ఇటీవలే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో కాజల్ పాత్రను ఎడిటింగ్‌లో కట్ చేశారు. కాజల్ లాంటి పెద్ద హీరోయిన్‌ను గెస్ట్ పాత్రకు వాడుకోవడం తనకు ఇష్టం లేదని.. ఇదే విషయాన్ని కాజల్‌కు చెప్పి వివరించామని దర్శకుడు కొరటాల శివ స్వయంగా వెల్లడించాడు.
కాజల్ అగర్వాల్ నటనా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి . తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో కళ్యాణ్‌రామ్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో లంగా, వోణీలో కాజల్ తన అందచందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత కృష్ణవంశీ చందమామ మూవీ కాజల్‌కు బిగ్ బ్రేక్ తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత మగధీర, బృందావనం, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, ఎవడు వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ 30కి పైగా సినిమాల్లో నటించింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జోడీ కట్టింది. దశాబ్ద కాలంపాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. ఈ క్రమంలోనే కాజల్ 2020లో గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తను పెళ్ళిచేసుకుంది. ఇప్పుడు బిడ్డను కనడంతో సినిమాలకు గుడ్‌బై చెప్పిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అటు కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ కూడా పెళ్లయిన తర్వాత సినీ పరిశ్రమకు దూరమైన సంగతి తెలిసిందే. కాకపోతే నిషాకు పెళ్లి అయ్యే సమయానికి సినిమా అవకాశాలు అంతగాలేవు.