
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన యమలీల సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసి ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించిన హీరోయిన్ ఇంద్రజ. ఆమె తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలీ లాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ వరకు అందరితోనూ ఇంద్రజ జోడీ కట్టింది. అయితే యమలీల సినిమా కంటే ముందే ఓ స్టార్ హీరో సినిమాలో ఇంద్రజ ఐటం సాంగ్‌లో నటించింది. హలో బ్రదర్ సినిమాలో ఓ పాటలో అక్కినేని నాగార్జునతో కలిసి ఆడిపాడింది. అయితే ఇంద్రజ అసలు పేరు రజతి. పాఠశాలలో కూడా ఆమెను రజతి అనే పిలిచేవాళ్లు. రజతి అనేక సంగీత, నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకుంది. శాస్త్రీయ నాట్యంలో శిక్షణ పొందిన ఆమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించింది. ఆమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్. అయితే అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె మలయాళంలో అగ్ర కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకుంది. తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇంద్రజ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2005, సెప్టెంబర్ 7వ తేదీన వ్యాపారవేత్త అబ్సర్‌ను వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు వీళ్లు ఆరేళ్ల పాటు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఆ తరువాత వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఇద్దరి అభిప్రాయాలు పంచుకున్నారు. ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్నారు. అబ్బర్-ఇంద్రజ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు సారా.
ఇంద్రజ కుమార్తె సారా త్వరలో సినిమాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని కోసం సారా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా కథానాయికగా పరిచయం అవుతుందని టాక్ నడుస్తోంది. అయితే ఇంద్రజ ప్రేమ వివాహానికి మతం ఎలాంటి అడ్డురాలేదు. దీనిపై ఆమె స్పందిస్తూ ఇష్టం అనేది మతం, కులం చూసి కలగదు అని.. మతానికి, మనసుకి నచ్చడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆకలికి కులం, మతం, ప్రాంతం అనే బేధాలు ఉండవు అని.. అలాగే మనసు కూడా ఎవరిని ఎప్పుడు ఇష్టపడుతుందో తెలియదని అభిప్రాయపడింది. తనకు సంబంధించిన అన్ని విషయాలలో తన భర్త ప్రమేయం ఉంటుందని ఇంద్రజ వివరించింది. ప్రస్తుతం ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ నడుస్తోంది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో రోజా ప్లేస్‌లో జడ్జిగా వ్యవరిస్తోంది. అంతేకాకుండా అల్లుడు అదుర్స్, స్టాండప్ రాహుల్ వంటి సినిమాల్లో కూడా నటించింది. అంతేకాకుండా బుల్లితెరపై జెమినీ టీవీలో సుందరకాండ అనే సీరియల్‌లో కూడా ఇంద్రజ నటించింది.
1
2