
గాన గాంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన పాటలతో కొన్ని దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు ఆయువుపట్టుగా నిలిచారు. పాట ఎలా పాడితే జనంలోకి వెళ్తుందో ఆయనకు తెలుసు. ఐదారేళ్ల కిందటి వరకు దాదాపు ప్రతి సినిమాలోనూ బాలు పాడిన పాట ఉంటుందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఎలాంటి హీరోకు అయినా బాలు గాత్రం ఇట్టే సూటవుతుంది. తన కెరీర్‌లో ఆయన ఎన్నో భాషల్లో 40వేలకు పైగా పాటలను ఆలపించారు. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో 2020లో ఆయన కరోనాతో మృతి చెందారు. ఎస్పీ బాలు మృతితో సినీ ప్రపంచం మూగబోయింది. మళ్లీ ఆయనలా పాటలు పాడే గాయకుడు రాడు.. రాలేడు అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే వర్ధమాన గాయకులందరూ మూడు, నాలుగు సినిమాలకే ఫేడవుట్ అయిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అటు ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయకుడే. ఎస్పీ బాలు వారసుడిగా ఇండస్ట్రీలో చరణ్ అడుగుపెట్టాడు. నిర్మాతగా, సింగర్‌గా, దర్శకుడిగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చరణ్ స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చరణ్‌కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎస్పీ చరణ్ ఓ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఆధారంగానే తమిళ మీడియాలో ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు. 7/G బృందావన కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్. ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన ఎస్పీ చరణ్ ‘ఏదో కొత్తగా జరగబోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో క్షణాల్లోనే ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మాములుగానే ఏం లేకపోయినా సోషల్ మీడియాలో ఏదో ఉన్నట్లు ఓ రేంజ్‌లో హడావిడి చేస్తుంది. పైగా ఎస్పీ చరణ్ ఓ హీరోయిన్‌తో ఫోటో దిగి దానిని పోస్ట్ చేసి ఏదో జరగబోతుందని హింట్ ఇస్తే నెటిజన్‌లు ఊరికే ఊరుకుంటారా చెప్పండి. దీంతో ఎస్పీ చరణ్ హీరోయిన్ సోనియా అగర్వాల్‌ను త్వరలో పెళ్లి చేసుకుంటాడని టాక్ నడుస్తోంది. సోనియా అగర్వాల్‌తో పెళ్లిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చరణ్ దీనిని కవర్ చేసుకుందామని భావించి.. మరో పోస్ట్ పెట్టి ఇండియన్ వెబ్‌సిరీస్, ఫిలింప్రొడక్షన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు. ఈ ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టాలనుకున్న చరణ్‌కు నెటిజన్ల నుంచి మరిన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండో సారి చరణ్ పోస్ట్ చేసిన ఫోటోలో సోనియాతో పాటు నటి అంజలి, మరో నటుడు కూడా ఉన్నారు. దీంతో కొందరు నెటిజన్లు ముందుగా ఈ ఫొటో ఎందుకు పెట్టలేదని, సోనియాతో ఉన్న ఫొటోనే జూమ్ చేసి ప్రత్యేకంగా ఎందుకు పోస్ట్ చేశారంటూ నిలదీశారు. కాగా ఎస్పీ చరణ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ముందుగా స్మితను పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం 2002లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. తర్వాత 2012లో అపర్ణను పెళ్లి చేసుకున్నాడు. అటు సోనియా అగర్వాల్ కూడా 7 / జీ బృందావన కాలనీ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. తక్కువ టైంలోనే వీరి మధ్య స్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత సెల్వ రాఘవన్ మరో పెళ్లి చేసుకున్నా సోనియా మాత్రం ఒంటరిగానే జీవిస్తోంది.