
యువ హీరో నాగచైతన్య అందరికీ సుపరిచితమే. అక్కినేని నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలంలోనే తనకంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్‌ను చైతూ క్రియేట్ చేసుకున్నాడు. జోష్‌తో టాలీవుడ్‌లోకి వచ్చి అందరిలోనూ జోష్‌ను నింపాడు. ఏ మాయ చేశావె అంటూ అందరినీ మాయ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ సినిమాలో నటించిన సమంతతో ప్రేమలో పడిపోయాడు. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి టాలీవుడ్‌లో నాగచైతన్య-సమంత పెయిర్ స్టార్ కపుల్‌గా మారిపోయింది. వాళ్లిద్దరూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండటం కారణంగా ఏం చేసినా క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. వీళ్ల వివాహం అయినప్పటి నుంచి నెటిజన్‌లు కూడా ఎక్కువగా వీరిపైనే కాన్సంట్రేషన్ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారి తీసింది.
అసలు కారణమేంటో తెలియకుండా స్టార్ కపుల్ ఎలా విడిపోయారో అంటూ పలువురు అనేక రకాలుగా వార్తలు వండి వారుస్తున్నారు. విడిపోయిన తర్వాత అటు నాగచైతన్య, ఇటు సమంత ఎవరి కెరీర్‌తో వారు బిజీగా గడుపుతున్నారు. వరుస సినిమాలు చేసుకుంటూ వారి పనుల్లో వారు ఉన్నారు. కానీ కొన్ని సైట్స్, యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్స్ మాత్రం వీరి పర్సనల్ లైఫ్ గురించి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య ఓ స్టార్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు కొద్దిరోజులుగా పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. పలు హిందీ సినిమాలతో పాటు తెలుగులో గూఢచారి, ఇటీవల మేజర్ సినిమాతో మెప్పించిన శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చైతూ, శోభిత చాలా సార్లు కలిసారని, నాగచైతన్య శోభితని తన ఇంటికి కూడా తీసుకెళ్లి ఇంటిని చూపించాడని, వీళ్లిద్దరు ఇటీవల ఓ పార్టీకి కూడా కలిసి వెళ్లారని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే కొన్ని సైట్స్ వీరిద్దరి డేటింగ్ గురించి మాత్రమే రాయకుండా ఈ పని సమంత చేయించిందంటూ రాసుకొచ్చాయి. సమంత పీఆర్ టీం కావాలనే చైతూపై ద్వేషంతో ఇలాంటి పుకార్లు పుట్టించిందని ఆరోపించాయి. ఈ న్యూస్ సమంత వరకు వెళ్లడంతో ఆమె అగ్గి మీద గుగ్గిలం అయ్యింది.
ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే, కానీ అబ్బాయిపై పుకార్లు వస్తే అమ్మాయే చేయించింది. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మేము ఎప్పుడో మూవ్ అన్ అయిపోయాము. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీ పని మీద, మీ కుటుంబాల మీద ఏకాగ్రత పెట్టండి అంటూ సమంత పోస్ట్ చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అక్కినేని నాగచైతన్య థాంక్యూ సినిమాతో బిజీగా ఉండగా, సమంత కూడా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా శాకుంతలం, యశోద వంటి సినిమాలతో సమంత బిజీగా గడుపుతోంది. కాగా నాగచైతన్య, సమంత ఇద్దరు ప్రేమించుకుని 2017లో వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్టు ప్రకటించారు. సమంత ఫ్యామిలీ మేన్-2 వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించడమే వీరిద్దరి మధ్య విభేదాలకు కారణమని ఇప్పటికీ టాక్ నడుస్తోంది.