
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటే అభిమానులు ఊగిపోతారు. సినిమాల్లో ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమా రిలీజైన రోజు అభిమానులకు పండగే. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాలని పవన్‌కు మనసులో ఉన్నా రాజకీయాలు డబ్బులతో ముడిపడి ఉండటంతో ఆయన సినిమాలు కూడా చేస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా సంపాదించిన మొత్తం లెక్కలు వేస్తే ఆయనకు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి. కానీ ఆయన సంపాదించిన డబ్బుల్లో ఎక్కువగా సేవా కార్యక్రమాలకు, దానధర్మాలకు ఉపయోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని విపత్తులు సంభవించిన పేదలకు పవన్ సహాయం చేస్తుంటారు. ఇటీవల ఏపీలో పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో కౌలు రైతులకు ఆర్ధిక సహాయం అందించారు. దీని కోసం రూ.30 కోట్లను వెచ్చించారు.
మరోవైపు రాజకీయాల పరంగా కూడా ప్రజలకు పవన్ ఎంతో సహాయం అందిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం రైతుల ఇళ్లను కూల్చివేసిందని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.లక్ష మేర ఆర్ధిక సహాయం అందించి తనలోని గొప్ప మనసు చాటుకున్నారు. అందుకే పవన్‌ను అభిమానులు విపరీతంగా ఆదరిస్తున్నారు. తన అభిమాన నాయకుడిని వేరే పార్టీకి చెందిన వాళ్లు ఒక్క మాట అన్నా ఊరుకోకుండా వాళ్లను జనసైనికులు ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆర్ధిక పరిస్థితికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వీడియోలో ఓ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తాను సంపాదించిన డబ్బులను ప్రజలకు దానం చేసి టాక్సు కట్టడానికి 5 కోట్ల రూపాయిలు అప్పు చేయడం తన కళ్ళతో చూశానని వివరించారు. దీంతో పవన్ అప్పు చేయడమేంటని పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
ఈరోజుల్లో బడా నేతలు ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలి అని ప్రయత్నిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం తన దగ్గర డబ్బు లేకున్నా అప్పు చేసి మరీ ట్యాక్స్ కట్టడాన్ని అభిమానులు హర్షిస్తున్నారు. ఆయన్ను చూసి మిగతా రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలని జనసైనికులు హితవు పలుకుతున్నారు. కట్ చస్తే పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయాల్లో రాకపోవటానికి ఆర్థిక సమస్యలంటూ వస్తున్న వార్తలకు బలాన్ని చేకూర్చేలా ఆయన రీసెంట్‌గా మరో రెండు సినిమాల్లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో సాహో ఫేం దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మాతగా చేస్తున్న సినిమా ఒకటి. మరో సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్న సినిమా. ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మితం కానుంది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో గతంలో ప్రకటించిన మాదిరిగా భవదీయుడు భగత్ సింగ్ సినిమాను చేస్తారా.. లేదా తమిళ చిత్రం తేరి రీమేక్‌లో నటిస్తారా అనేది త్వరలోనే విడుదల కాబోతున్న సదరు సినిమా అనౌన్స్‌మెంట్‌తో తెలియనుంది.