
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారింది. విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి జరగడంతో పవన్ కళ్యాణ్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పవన్ పర్యటనపై ఆంక్షలు విధించారు. అంతేకాకుండా పలువురు జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ఫోన్ చేశారు. శనివారం విశాఖ జరిగిన ఘటనపై సంఘీభావం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులను చంద్రబాబు ఖండించినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం పోలీసులతో పాలన చేయాలనుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. దీంతో పవన్ కళ్యాణ్ వెనుక చంద్రబాబు ఉన్నారనే ఆరోపణలను వైసీసీ నేతలు చేస్తున్నారు. కావాలనే పవన్ విశాఖ వచ్చారని.. వైసీపీ చేపట్టిన విశాఖ గర్జనను పవన్ అడ్డుకోవడానికే ఈ పర్యటన చేపట్టారని వైసీపీ కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు.
అటు పవన్ కళ్యాణ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫోన్ చేశారు. విశాఖలో జరిగిన పరిణామాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు.ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. బూమ్ బూమ్ మందులు అమ్ముకోవడం తప్ప అభివృద్ధి ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడ ఉందని సోము వీర్రాజు ఘాటుగా విమర్శించారు పవన్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఫైర్ అయిన వీర్రాజు.. జనసేనకు మద్దతుగా విశాఖకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు నోవాటెల్ హోటల్‌లో పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్సీ మాధవ్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలను చర్చించింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అటు తనకు విశాఖ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై పవన్ స్పందించారు. నేర చరితుల చేతిలో అధికారం ఉంటే ఇలానే ఉంటుందన్నారు. రాష్ట్రంలో బలహీనుల విషయంలో లా అండ్ ఆర్డర్ బలంగా పనిచేస్తోందని.. అడిగేవాళ్లు లేరని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టేందుకే విశాఖ గర్జన చేపట్టారని దుయ్యబట్టారు.
అయితే ఆదివారం సాయంత్రం విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ బయటకు వస్తారని భారీగా జనసేన కార్యకర్తలు నోవాటెల్ వద్దకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో జనసైనికులు నోవాటెల్ దగ్గర ఫుట్‌పాత్‌పై బైఠాయించారు. ఆ ప్రాంతం నుంచి జనసేన కార్యకర్తలను ఖాళీ చేయించడానికి ప్రయత్నించడంతో పోలీసులకు, జనసైనికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. అంతకుముందు విశాఖ పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించడంతో ఎయిర్‌పోర్టు నుంచి నోవాటెల్ హోటల్ వరకు కార్యకర్తలతో కలిసి పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీగా వెళ్లారు. ఆ సమయంలో స్ట్రీట్ లైట్లు వెలుగకపోవడంతో జనసైనికుల సెల్‌ఫోన్ల లైటింగ్‌తోనే ర్యాలీ కొనసాగగా.. తాజాగా దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్‌ను జనసేన పార్టీ విడుదల చేసింది. దీంతో వీడియో అదిరిపోయిందని జనసైనికులు కామెంట్ చేస్తున్నారు.