
తమిళ సీనియర్ హీరో కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1960, సెప్టెంబర్ 13న జన్మించిన కార్తీక్ అసలు పేరు మురళీ కార్తీకేయన్ ముత్తురామన్. అతడు సీనియర్ నటుడు ఆర్.ముత్తురామన్ కుమారుడు. తమిళంలో ఆర్.ముత్తురామన్ అగ్ర దర్శకుడిగా పలు సినిమాలను తెరకెక్కించాడు. ఎక్కువగా రజినీకాంత్ సినిమాలకు దర్శకత్వం వహించారు. రజినీకాంత్ సూపర్‌స్టార్ కావడంలో ఆర్.ముత్తురామన్ సినిమాలే కీలకపాత్ర పోషించాయి. అతడి కుమారుడు కార్తీక్ 1981లో భారతీరాజా దర్శకత్వం వహించిన అలియాగల్ వైవాతిల్లై అనే తమిళ మూవీతో సినీ రంగ ప్రవేశం చేశాడు. అయితే తెలుగులో సీతాకోకచిలుక, అభినందన, అన్వేషణ, మగరాయుడు వంటి చిత్రాలతో కార్తీక్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేకాదు మణిరత్నం ఘర్షణ మూవీ అతడికి తెలుగులో మంచి పేరు తీసుకొచ్చింది.
ఘర్షణ సినిమా తర్వాత కార్తీక్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 125 తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. అయితే సినీ పరిశ్రమలో ఇతర హీరోల మాదిరిగానే కార్తీక్ కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. చెడు వ్యసనాలు కార్తీక్ కెరీర్‌ను దెబ్బతీశాయి. దీంతో క్రమంగా సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. అయితే వ్యక్తిగత జీవితంలో కార్తీక్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. 1988లో సహనటి రాగిణిని కార్తీక్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో కూడా నటించారు. ఈ దంపతులకు గౌతమ్ కార్తీక్, గైన్ కార్తీక్ కుమారులు ఉన్నారు. ముఖ్యంగా కార్తీక్ పెద్దబ్బాయి గౌతమ్ కార్తీక్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. అతడు మణిరత్నం దర్శకత్వం వహించిన కడలి అనే మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. అయితే రాగిణిని పెళ్లి చేసుకున్న అనంతరం కార్తీక్ మరో నాలుగేళ్లకు ఆమె సోదరి రతిని కూడా 1992లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు తిరన్ కార్తీక్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.
రతిని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కార్తీక్ జీవితం మొత్తం తలకిందులైంది. తమిళ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అవార్డులతో పాటు నంది అవార్డును కూడా సొంతం చేసుకున్న కార్తీక్ రాగిణి సోదరిని పెళ్లి చేసుకున్నాకే.. ఆయన జీవితం కష్టాల కొలువులో మునిగిపోయింది. 2000 సంవత్సరం నుంచి ఆయన కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కార్తీక్ మరోసారి రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస అవకాశాలను పొందుతున్నాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస అవకాశాలతో రాణిస్తున్నాడు. మరోవైపు రాజకీయాల్లో కూడా కార్తీక్ బిజీగా ఉన్నాడు. ఆయన మనిద ఉరిమై కట్చి అనే పార్టీని కూడా స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి మద్ధతు ప్రకటించాడు. ఆ సమయంలో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి తరఫున ప్రచారం నిర్వహిస్తూ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరాడు. అటు కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ మలయాళ ముద్దుగుమ్మ మంజిమ మోహన్‌తో కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లితో ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.