
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ దిగ్గజ నటి విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నరేష్ గతంలో పలు సినిమాల్లో హీరోగా నటించి మంచి హిట్లు అందుకున్నాడు. వృత్తిపరంగా నరేష్ కెరీర్ బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకుని ఇద్దరితో విడాకులు తీసుకున్న ఆయన తాజాగా మూడో భార్య రమ్యతో విడాకులు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే రమ్య రఘుపతికి నరేష్ దూరంగా ఉంటున్నాడు. ఇటీవల మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్నాడు. త్వరలో ఆమెను నాలుగో పెళ్లి చేసుకోనున్నాడు. అయితే నరేష్, మాజీ భార్య రమ్య రఘుపతి ఎపిసోడ్‌లో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఇటీవల నరేష్‌పై రమ్య తీవ్ర ఆరోపణలు చేయగా.. తాజాగా రమ్యపై నరేష్ సంచలన ఆరోపణలు చేశాడు.
తనను హత్య చేసేందుకు రమ్య రఘుపతి ప్రయత్నిస్తోందంటూ నరేష్ కోర్టును ఆశ్రయించాడు. వివాహం జరిగిన నెల తర్వాతి నుంచే రమ్య తనను వేధించేదని, ఇప్పుడు తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందంటూ నరేష్ తన పిటిషన్‌లో ఆరోపణలు చేశాడు. కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్ రాకేష్ శెట్టితో రెక్కి చేయించిందని.. అలాగే ఓ పోలీస్ ఆఫీసర్ సహాయంతో తన ఫోన్ హ్యాక్ చేసిందని పిటిషన్‌లో నరేష్ పేర్కొన్నాడు. పెళ్లి తర్వాత రమ్య తనకు తిండి కూడా పెట్టేది కాదని.. కొడుకును కూడా కొట్టేదని ఆరోపించాడు. ఫంక్షన్ ఏదైనా ఉంటే తాగి రచ్చ రచ్చ చేసేదని తెలిపాడు. రమ్యకు తన కంటే డబ్బుపైనే ఎక్కువ ఇష్టమని అందుకే ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. అంతేకాకుండా రమ్య బంధువు అయిన మాజీ మంత్రి రఘవీరారెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతోందని, 10 కోట్ల రూపాయలు ఇస్తే సెటిల్ మెంట్ చేసుకుంటానంటూ మధ్యవర్తితో బేరసారాలు చేసిందని నరేష్ ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఇటీవల రమ్య మీడియాతో మాట్లాడుతూ పవిత్ర లోకేష్‌పై దారుణంగా విమర్శలు చేసింది. నరేష్‌కు తాను విడాకులు ఇవ్వనని, వాళ్ళిద్దర్నీ పెళ్లి చేసుకోనివ్వను అని చెప్పింది. నరేష్ చాలా దుర్మార్గుడు అని.. ఎంతో మందితో అతడికి అక్రమ సంబంధాలు ఉండేవని రమ్య రఘుపతి ఆరోపించింది. తప్పులన్నీ నరేష్ చేసి తనపై ఆరోపణలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆమె చెప్పింది. దేవుడి లాంటి కృష్ణగారితో తనకు అక్రమ సంబంధం ఉందని నరేష్ ఆరోపించినట్లు రమ్య తెలిపింది. కానీ కృష్ణగారి ఇంటి ప్రతిష్ట, మర్యాదలను దృష్టిలో పెట్టుకుని ఇన్నాళ్లూ ఈ నిజాన్ని చెప్పలేదని వివరించింది. కానీ రోజురోజుకు నరేష్ చేస్తున్న దారుణాలు పెరిగిపోతున్నాయని.. అందుకే ఈ నిజం ఇప్పటికైనా చెప్పాల్సి వచ్చిందని రమ్య చెప్పింది. తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని నరేష్ చేయని పనులు లేవు అని.. చివరికు కృష్ణగారి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. తనకు ఇంజక్షన్ సూట్ పంపాడని.. అందులో తన నుంచి కృష్ణగారికి ప్రాణహాని ఉందని రాశాడని రమ్య ఆరోపించింది. నరేష్‌తో విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని.. అన్నీ కోర్టులోనే తేల్చుకుంటానని రమ్య స్పష్టం చేసింది.