
మీకు హీరో ఆదిత్య ఓం గుర్తున్నాడా? నందమూరి హరికృష్ణ నటించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమా గుర్తుంటే ఆదిత్య ఓం గుర్తుకు వచ్చినట్లే. ఆ సినిమాలో హీరోయిన్ అంకితతో తిరుగుతూ పాటలు పాడుతుంటాడు. ఈ సినిమా అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. లాహిరి లాహిరి లాహిరిలో మూవీ తర్వాత ధనలక్ష్మీ ఐలవ్యూ, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటి కొస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, భామా కలాపం వంటి సినిమాల్లో ఆదిత్య ఓం నటించాడు. పలు తమిళ సినిమాల్లో కూడా నటించాడు. అయితే బ్రేక్ మాత్రం రాలేదు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి తెలుగు హీరోగా మారిన ఆదిత్య ఓం ఒకానొక దశలో అవకాశాలు రాక డీలా పడిపోయాడు. దీంతో బాలీవుడ్లోనే ప్రొడక్షన్ మేనేజర్ అవతారం ఎత్తాడు. ఇటీవల ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆదిత్య ఓం ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.
ఆదిత్య ఓం ఇటీవల కమల్‌హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆదిత్య ఓం మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో తాను ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో నటించినా హిట్ రాకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయని… అందుకే బాలీవుడ్‌కు వెళ్లిపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. అయితే చివరకు వెబ్ సిరీస్‌లలో కూడా తనకు అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కెరీర్ తొలినాళ్లలో ముంబైలో ట్రైనింగ్ తీసుకునే సమయంలో డైరెక్షన్ డిపార్టుమెంట్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని.. ఆ అనుభవంతో స్నేహితులను కలిసి ప్రొడక్షన్ డిపార్టుమెంట్లో చేరినట్లు ఆదిత్య ఓం పేర్కొన్నాడు. తన స్నేహితులు సినిమాలను నిర్మించే సమయంలో తాను విలువైన సూచనలు ఇచ్చేవాడినని పేర్కొన్నాడు. అలా శూద్ర సినిమాకు ప్రొడక్షన్లో పనిచేసినట్లు గుర్తుచేసుకున్నాడు. చివరకు 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి ఆదిత్య ఓం తనలోని మరో టాలెంట్ బయటపెట్టాడు.
తాజాగా ఆదిత్య ఓం మొట్టమొదటిసారిగా పవిత్ర అనే షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జ్యోతి, గాయత్రి గుప్త, ఐశ్వర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్గా పవిత్ర షార్ట్ ఫిలిం ప్రీమియర్స్ ప్రదర్శించగా.. దీనిని వీక్షించిన పలువురు ప్రముఖులు ఆదిత్య ఓంపై ప్రశంసలు కురిపించారు. తనకు వైవీఎస్ చౌదరి ఫిలిం ఇండస్ట్రీలో మంచి బ్రేక్ ఇచ్చారని.. లాహిరి లాహిరి లాహిరిలో సినిమా సమయంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ జనరల్ సెక్రటరీ టి.ప్రసన్న కుమార్ ఎంతో సాయం చేసినట్లు ఆదిత్య ఓం వివరించాడు. 2016లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే సినిమా తీసినట్లు గుర్తుచేసుకున్నాడు. అప్పుడు కూడా ప్రసన్నకుమార్ వచ్చి కో ఆపరేట్ చేశారని తెలిపాడు. ప్రస్తుతం దాదాపు 20 సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాని.. పవిత్ర షార్ట్ ఫిలిం అందరికీ తప్పకుండా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.