
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కొంతకాలంగా మయోటైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ మేరకు చికిత్స తీసుకుంటున్న ఫొటోలను కూడా సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ నటులతో పాటు సమంత అభిమానులందరూ ఆకాంక్షించారు. అయితే ప్రస్తుతం సమంత ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రచారం జరుగుతోంది. దీంతో శాశ్వతంగా సమంత సినిమాలకు దూరం కానుందని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఖుషి సినిమా ఇప్పటివరకు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో విజయ్ దేవరకొండ వెల్లడించాడు. వాస్తవానికి ఈ మూవీ ఈనెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్యం దృష్ట్యా ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కావడంతో చిత్ర యూనిట్ వాయిదా వేసింది.
మరోవైపు సమంత చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఆమె అనారోగ్యం కారణంగా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలన్నీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఖుషి సినిమాను మినహాయిస్తే పలు ప్రాజెక్టుల నుంచి సమంత తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఖుషి సినిమాను పూర్తి చేసి సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ వ్యాధితో పోరాడుతున్నవారు ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సి ఉందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఆమె సైన్ చేసిన సినిమాల నుంచి తొలగిపోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖుషి చివరి అంకానికి చేరుకోవడంతో ఆ సినిమాను మాత్రం పూర్తిచేసి మిగతావాటికి దూరం కానుందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. అయితే సమంత నిర్ణయాన్ని తెలుగు నిర్మాతలు అంగీకరించినా బాలీవుడ్ నిర్మాతలు మాత్రం కుదరదని చెప్పినట్లు సమాచారం. సమంత వెళ్ళిపోతే తమకు నష్టం వాటిల్లుతుందని.. ఆమె ఎలాగైనా నటించాలని డిమాండ్ చేస్తున్నారట.
ఈ నేపథ్యంలో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల విషయంలో సమంత తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ తర్వాత బాలీవుడ్‌లోనూ సమంతకు క్రేజ్ పెరిగింది. దీంతో ఆమె బాలీవుడ్‌లోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతలోనే మయోటైటిస్ వ్యాధితో బాధపడుతుండటంతో బాలీవుడ్ సినిమా కూడా ఆగిపోయింది. తెలుగులో సమంత నటించిన శాకుంతలం షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఆమె యశోద చిత్రంతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. యశోద సక్సెస్ నేపథ్యంలో మేకర్స్ సీక్వెల్ తీయడానికి సిద్ధమని ప్రకటించారు. సమంత అంగీకరిస్తే యశోద పార్ట్ 2 భారీ బడ్జెట్‌తో చేయనున్నారట. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూనే సమంత యశోద చిత్రానికి డబ్బింగ్ చెప్పింది. అంతేకాకుండా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంది. ఏదేమైనా సమంత నటనకు దూరం అవుతుందన్న వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు.