
కర్ణాటకలో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అప్పు కోసం ఏదైనా చేసే అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ ఎలానో శాండిల్‌వుడ్‌లో పునీత్ రాజ్‌కుమార్ అలాగన్నమాట. అందుకే ఇద్దరినీ అభిమానులు పవర్‌స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ చనిపోయిన తర్వాత ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆయనంటే ఇప్పటికీ అభిమానించే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో స్కూల్ విద్యార్థులు కూడా ఉన్నారు. మనిషి చనిపోయాక కూడా జీవించి ఉండాలని.. అదే నిజమైన జీవితం అని చాలా మంది అంటారు. మనిషి బ్రతికి ఉండగా చేసిన మంచి పనులు అతన్ని మరణించాక కూడా జీవించేలా చేస్తాయి. అలా ఎన్నో మంచి పనులు చేసి ప్రజల గుండెల్లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిలిచిపోయారు. ప్రాంతాలకు అతీతంగా ఆయన ప్రజల అభిమానాన్ని పొందారు. ఇటీవల కర్నాటక ప్రభుత్వం పునీత్ రాజ్‌కుమార్‌ను కర్నాటక రత్న అవార్డుతో సత్కరించింది.
తాజాగా భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటకలోని ఓ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాము రూపొందించిన కేజీఎస్3 శాట్‌కు దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టారు. ఈ మేరకు శాటిలైట్ పునీత్‌గా నామకరణం చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను కక్షలోకి పంపాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరులో తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ54 వాహక నౌక ద్వారా పంపనున్నారు. ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. రూ 1.90 కోట్ల వ్యయంతో విద్యార్థులు ఈ శాటిలైట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఉపగ్రహ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ తెలిపారు. ఎంపిక చేయబడిన 1,000 మంది విద్యార్థులు మాత్రమే ఈ శాటిలైట్ బిల్డింగ్ మిషన్‌లో భాగం కావడానికి షార్ట్‌లిస్ట్ చేయబడ్డారని చెప్పారు.
కాగా పునీత్ రాజ్‌కుమార్ చివరిసారిగా నటించిన మూవీ జేమ్స్. ఈ సినిమా కన్నడలో మంచి విజయాన్ని సాధించింది. అదేవిధంగా కందాడ కుడి అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ రూపొందించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకుండానే ఆయన మరణించడంతో ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్ మిగిలిన భాగాన్ని విడుదల చేశారు. ఇది పునీత్ రాజ్‌కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిని ఇటీవల పునీత్ తొలి వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. అటు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పాల్గొని ఎమోషనల్ అయ్యారు. అప్పూ 21 ఏళ్లకే 35 సినిమాలు చేసి ఎందరికో గుప్తదానాలు చేశాడని ప్రశంసించారు. నాలుగేళ్ల వయసులోనే శబరిమల వచ్చాడని.. రాజ్‌కుమార్ అతడిని తన భుజాలపై పునీత్‌ను తీసుకొచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. పునీత్ మరణించిన సమయంలో తాను ఐసీయూలో ఉన్నానని, మూడు రోజుల తర్వాత పునీత్ మరణ వార్త విని షాక్ అయ్యానని రజనీకాంత్ అన్నారు.