
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీలో మహేష్ సరసన మహానటి కీర్తి సురేష్ జంటగా నటించింది. గత నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా తొలుత డివైడ్ టాక్ సొంతం చేసుకున్నా టిక్కెట్ రేట్ల కారణంగా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే హీరో మహేష్‌బాబు సొంతంగా నిర్మించిన మేజర్ సినిమా చాలా చోట్ల సర్కారు వారి పాట సినిమా వసూళ్లను బ్రేక్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమాకు సూపర్ హిట్ రావడం, టిక్కెట్ రేట్లు తక్కువగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మహేష్ నటించిన సినిమా కంటే మహేష్ నిర్మించిన సినిమాకు ప్రజాదరణ బాగుందని పలు ప్రాంతాల నుంచి రిపోర్టులు వస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా మేజర్ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడుపోయింది. హిందీ వెర్షన్ రూ. 5 కోట్లు బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 18 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే మేజర్ సినిమా తొలి మూడు రోజుల్లో రూ.18.8 కోట్ల గ్రాస్, రూ.11.25 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఏరియాల వారీగా చూసుకుంటే నైజాంలో రూ. 5.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 71 లక్షలు, నెల్లూరులో రూ. 50 లక్షలు రాబట్టింది. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో సంయుక్తంగా మహేష్‌బాబు మేజర్ సినిమాను నిర్మించాడు. ముంబైలో ఉగ్రవాదుల అటాక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ మూవీలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌లుగా నటించారు. ప్రకాష్‌రాజ్, రేవతి ముఖ్యపాత్రలు పోషించారు.
అయితే సర్కారువారి పాట సినిమా ఇప్పటికే డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు రెంటల్ పద్ధతిలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరో రెండు వారాల తర్వాత యూజర్లందరికీ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించారు. థమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మంచి ఊపును తెచ్చింది. భారత బ్యాంకింగ్ రంగంలో వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబుల కథనంతో సర్కారు వారి పాట సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం థమన్ తొలుత ‘మురారి వా’ అనే ఓ మాస్ సాంగ్‌ను కంపోజ్ చేశాడు. కొన్ని కారణాల వల్ల అది కాకుండా‘మ..మ..మహేషా’ అనే పాటను సినిమాలో ఫిక్స్ చేశారు. అయితే మురారి వా అనే పాటను ఇటీవల థియేటర్లలో యాడ్ చేశారు. ఇప్పుడు ఈ పాటను థియేటర్లలో మిస్ అయిన వారందరికీ సర్కారు వారి పాట ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది. ‘మురారి వా..’ పాటను జూన్ 7న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.