
టాలీవుడ్లో హీరోయిన్ సౌందర్యను ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. 2004లో ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినా ఇప్పటికీ మన మధ్యనే ఉన్నట్లు ప్రేక్షకులు భావిస్తారు. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు నిత్యం టీవీలలో ప్రసారమవుతూనే ఉంటాయి. అమ్మోరు, దొంగాట, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, చూడాలని ఉంది, అన్నయ్య, జయం మనదేరా, రాజా వంటి సినిమాలలో సౌందర్య చూపించిన అభినయానికి వెల కట్టలేం. ఎక్స్పోజింగ్ అనేది లేకుండా అభినయంతో ఆకట్టుకున్న ఈతరం హీరోయిన్లలో సౌందర్య ప్రత్యేక స్థానాన్ని అందుకుంది. రమ్యకృష్ణ, రోజా, రంభ, నగ్మా, ఆమని వంటి వాళ్లు ఎక్స్‌పోజింగ్‌తో పాత్రలు దక్కించుకుంటున్న రోజుల్లో సౌందర్య అందుకు భిన్నంగా నీరాజనాలు అందుకుంది. అందుకే హీరోయిన్లలో ఆమె స్థాయిని ఇప్పటివరకు ఎవరూ అందుకోలేకపోయారు. అయితే సౌందర్య మరణం అప్పట్లో ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. సౌందర్యతో పాటు అతడి సోదరుడు అమర్ కూడా ప్రమాదంలో మరణించాడు.
అయితే మరణించే సమయానికి సౌందర్యకు వివాహం జరిగింది. వరుసకు మేనమామ అయ్యే జీఎస్ రఘును సౌందర్య వివాహం చేసుకుంది. అతడు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. సౌందర్యకు 2003లో వివాహం కాగా అదే ఏడాది ఆమె మరణించడంతో భర్త రఘు షాక్ కారణంగా డిప్రెషన్లోకి వెళ్లాడు. ఆ తరవాత చాలా కాలం పాటు ఆయన ఒంటరి జీవితాన్ని గడిపాడు. 2011లో రఘు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన తన రెండో భార్య అపూర్వతో కలిసి గోవాలో కాపురం ఉంటున్నాడు. నిజానికి రఘును పెళ్లి చేసుకోవడం సౌందర్య తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయితే సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె ఆస్తిని రఘు ఒక్కడే అనుభవిస్తున్నాడు. దీంతో సౌందర్య తల్లిదండ్రులు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదనే టాక్ ఫిలింనగర్లో ఉంది. సౌందర్యకు అప్పట్లోనే వందల కోట్లకు పైగా ఆస్తి ఉందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు.
కాగా తెలుగు ఇండస్ట్రీలో సావిత్రి తర్వాత అంతటి స్థాయి సౌందర్యకే దక్కింది. కన్నడ పరిశ్రమకు చెందిన అమ్మాయే అయినప్పటికీ తెలుగమ్మాయే అనేంతలా సౌందర్య గుర్తింపు సంపాదించుకుంది. దాదాపుగా టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసన నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో పాటు రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్ వంటి హీరోలతో నటించింది. స్టార్ హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలే చేయాలి.. స్టార్ హీరోల సినిమాల్లోనే నటించాలనే పద్దతిని సౌందర్య పూర్తిగా మార్చేసింది. ఆమె ఎంత స్టార్ డం సంపాదించుకున్నా.. చిన్న హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించడానికి ఇన్‌సెక్యూర్‌గా ఫీలయ్యేది కాదు. బాబూమోహన్, అలీ వంటి కామెడీ హీరోల పక్కన ఐటం సాంగ్స్ చేసింది. అందుకే ఆమె గురించి అప్పటి దర్శక నిర్మాతలు చాలా గొప్పగా చెబుతుంటారు. ముఖ్యంగా సౌందర్య జగపతిబాబు, వెంకటేష్‌లతో అత్యధిక సినిమాల్లో నటించింది. సౌందర్య నటిగానే కాకుండా రాజకీయ పరంగా కూడా కొన్ని బాధ్యతలు చేపట్టింది. 2004లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేసింది.