
ఏపీలో ప్రస్తుతం పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ సంగతి ఎలా ఉన్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చ కూడా పూర్తయిందని టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒప్పందానికి కూడా వచ్చారని కొందరు నేతలు మాట్లాడుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. అన్ని అంశాల్లోనూ ఆ పార్టీ దారుణంగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి ఉందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ పొత్తు రాజకీయానికి తెరతీశారు. అటు పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అంటూ కర్నూలు జిల్లా పర్యటనలో వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో, ఎప్పుడు విడిపోతుందో చెప్పలేం. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండననే నానుడి ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి టీడీపీ దారుణ వైఫల్యాన్ని మూటగట్టుకుంది. దీంతో ఇప్పుడు మరోసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. అయితే ఓ సర్వే రిపోర్ట్ ఇప్పుడు అధికార పార్టీకి షాక్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి 30 కంటే ఎక్కువ సీట్లు రావని సర్వేలో స్పష్టమైనట్లు అర్ధమవుతోంది. అందుకే టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ నేతలు కంగారు పడుతున్నారని.. పైకి జగన్ సింహమంటూ కలరింగ్ ఇస్తున్నా లోలోపల వారి ఆందోళనకు కారణం సర్వే రిపోర్ట్ అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ హయాంలో టీడీపీ చేసిందేమీ లేదు కాబట్టే తనతో పొత్తు పెట్టుకోవాలని అందరి కాళ్ల, వేళ్ల మీద చంద్రబాబు పడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీని పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా అని జనసేన కార్యకర్తలందరూ పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. అయితే తాను సింగిల్‌గా రావాలని చెప్పడానికి వైసీపీ వాళ్లు ఎవరని పవన్ ప్రశ్నించారు. వైసీపీ వాళ్లకు అతి ఎక్కువైందని.. అది కాస్త తగ్గాలని హితవు పలికారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 175 సీట్లు ఉండగా.. జనసేనకు 40 నుంచి 45 సీట్లను టీడీపీ కేటాయించే అవకాశం ఉందని .. లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే 5 నుంచి 6 సీట్ల వరకు దక్కవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. అన్ని జిల్లాలలో జనసేన సీట్లు కేటాయించేలా ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజాసమస్యలు వదిలేసి మూడు ప్రధాన పార్టీలు పొత్తుల గురించి ఆలోచిస్తున్నాయని పలువురు నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని.. ఇప్పటి నుంచే పొత్తుల గురించి చర్చలు ఎందుకుని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయని ఆరోపించారు.