
టాలీవుడ్‌లో హాస్యబ్రహ్మ ఎవరంటే బ్రహ్మానందం పేరు చెప్పాల్సిందే. సినిమాలో బ్రహ్మానందం పాత్ర ఉంటే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్‌పై బ్రహ్మానందం అనే పేరు పడిందంటే చాలు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది. స్టార్ హీరోలకు సమానంగా ఆయనకు క్రేజ్ వచ్చిందంటే ఏ రేంజ్‌లో ప్రేక్షకులకు ఆయన గిలిగింతలు పెట్టి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నవ్వుల రారాజు దాదాపు మూడు తరాల ప్రేక్షకులను తనదైన హావభావాలతో చక్కిలిగింతలు పెట్టారు. బ్రహ్మానందం పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. 1956 ఫిబ్రవరి 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లిలో కన్నెగంటి నాగలింగాచారి-లక్ష్మీనరసమ్మ దంపతులకు బ్రహ్మానందం జన్మించారు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చిన ఆయన.. భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు.
అనంతరం గుంటూరు పీజీ సెంటర్‌లో తెలుగు సాహిత్యంలో MA పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టారు. సీనియర్ నరేష్ హీరోగా నటించిన తాతావతారం అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో హీరో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా బ్రహ్మానందం కనిపిస్తారు. అయితే బ్రహ్మానందంకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్లంట సినిమానే. ఈ సినిమాలో అరగుండు పాత్రలో నటించి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించారు. పోతావురా.. రేయ్.. నాశనమై పోతావ్ అంటూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్ నవ్వుల పువ్వులు పూయించింది. అహ నా పెళ్లంట తర్వాత బ్రహ్మీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఒక దశలో బ్రహ్మానందం లేని సినిమా లేదు అనేంతగా నటించారు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010లో గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కారు. స్టార్ హీరోలతో సమానంగా బ్రహ్మీ రెమ్యునరేషన్ తీసుకునేవారు.
ఎన్ని కామెడీ పాత్రలు చేసినా బ్రహ్మానందం తన రెమ్యునరేషన్ దగ్గర డబ్బులు విషయంలో అస్సలు కామెడీగా ఉండేవాళ్లు కాదట. రంగుల ప్రపంచంలో జీవితాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో తెలియదు కాబట్టి ఆయన పైసా పైసా కూడబెట్టేవారట. మిగతా నటుల తరహాలో బ్రహ్మానందం తన సంపాదనను వృథాగా ఖర్చుపెట్టలేదు. తన సంపాదించిన డబ్బులను భూముల మీద పెట్టుబడిగా పెట్టేవారు. అందుకే ఆయనకు ఇప్పుడు రూ.500 కోట్ల ఆస్తి ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో కొన్ని ల్యాండ్స్ ధర ఇప్పుడు అధికంగా పెరగడం వల్ల బ్రహ్మానందంకు బాగా కలిసొచ్చిందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వయసు మీరడంతో బ్రహ్మానందం అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఆయన కుమారుడు గౌతమ్ సినిమాల్లోకి వచ్చినా పెద్దగా నిలదొక్కుకోలేదు. అయితే బ్రహ్మానందం లాక్‌డౌన్ సమయంలో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. తనలో ఉన్న ఆర్టిస్టును బయటకు తీసుకువచ్చి రకరకాల బొమ్మలు వేశారు. తర్వాత వాటిని టాలీవుడ్‌లోని స్టార్ హీరోలకు బహుమతిగా కూడా ఇచ్చారు.