
సొట్ట బుగ్గల సుందరి సమీరారెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సమీరారెడ్డి ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఎన్టీఆర్‌తో కలిసి అశోక్, నరసింహుడు లాంటి సినిమాల్లో కూడా నటించింది. అటు మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవి సినిమాలో కూడా ఆడిపాడింది. అయితే ఉన్నట్టుండి టాలీవుడ్ నుంచి ఈ ముద్దుగుమ్మ మాయమైపోయింది. చేసింది కొద్ది సినిమాలే అయినా ఎన్టీఆర్‌తో ఎఫైర్ కారణంగా ఆమెను తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే ఉన్నారు. తెలుగు సినిమాల్లో నటించకపోయినా సమీరారెడ్డి సోషల్ మీడియాలో అభిమానులతో నిత్యం టచ్‌లోనే కనిపిస్తుంది. తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా సమీరారెడ్డి అభిమానులతో ఇంటరాక్షన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల సమీరారెడ్డికి అభిమానులు పలు ప్రశ్నలు సంధించారు. ఎన్టీఆర్‌ను ప్రేమించిన మాట నిజమేనా అని కొందరు నెటిజన్‌లు ప్రశ్నించారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌ను ఎందుకు పెళ్లి చేసుకోలేదని నిలదీశారు. పెళ్లి కూడా నిశ్చయమైందని అప్పట్లో ప్రచారం జరిగిందని.. కానీ ఎన్టీఆర్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల ప్రశ్నల పట్ల సమీరారెడ్డి అసహనానికి గురైంది. తాను ఎన్టీఆర్‌ను ప్రేమించిన మాట పుకారేనని స్పష్టం చేసింది. తమకు తెలియకుండానే తాము ప్రేమలో ఉన్నట్లు మీడియా వార్తలు పుట్టించిందని వెల్లడించింది. ఎన్టీఆర్‌తో తనకు పెళ్లి కుదిరిందని.. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని ఇష్టం వచ్చినట్లు ఎవరికి వాళ్లు వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పింది. మీడియా అంటేనే క్రేజీగా మారిందని.. కొన్నిసార్లు మీడియాలో వచ్చే వార్తలు చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్ధం కావడం లేదని సమీరారెడ్డి అభిప్రాయపడింది.
కాగా 2002లో హిందీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమీరారెడ్డి అక్కడ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుని ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. 2005లో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు, హిందీ తో పాటు బెంగాలీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా నటించింది. తెలుగు ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు అందుకోలేకున్నా కూడా ఇతర భాషలలోనూ అవకాశాలు అందుకుని మంచి పేరు సంపాదించుకుంది. 2014లో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అక్షయ్ వార్దేని పెళ్లి చేసుకోగా ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. సమీరారెడ్డి, అక్షయ్ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సమీరారెడ్డికి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండేది కాదు. నిజానికి ఆమె వయసులో ఉన్న చాలామంది హీరోయిన్స్ ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తుంటారు. కారణం నిత్యం మేకప్ లాంటివి వేసుకుని తమ వయసుని బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ సమీరా రెడ్డి మాత్రం తన వయసును అసలు దాచుకోదు. ఇటీవల ఆమె జుట్టు తెల్లబడటంపై పలువురు సెటైర్లు కూడా వేశారు.