
బిగ్‌బాస్-6 సెకండ్ వీకెండ్‌కు చేరుకుంది. శుక్రవారం ఎపిసోడ్లో కెప్టెన్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. తొలివారం కెప్టెన్‌గా బాలాదిత్య తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగా రెండో వారం కెప్టెన్‌గా రాజ్‌ను హౌస్‌లోని సభ్యులు ఎంచుకున్నారు. కెప్టెన్ పదవికి నలుగురు కంటెండర్లు పోటీ పడ్డారు. చలాకీ చంటి, రాజ్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య పోటీ పడగా.. వీరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు అప్పగించాడు. ఇద్దరు చొప్పున ఓటు వేసే అవకాశాన్ని కల్పించాడు. దీంతో రాజ్‌కు నాలుగు ఓట్లు పడగా ఇనయా సుల్తానా, చలాకీ చంటిలకు ఒక్కో ఓటు, ఆర్జే సూర్యకు రెండు ఓట్లు పోలయ్యాయి. దీంతో కెప్టెన్‌గా రాజ్‌కు అవకాశాన్ని ఇంటి సభ్యులు కల్పించారు. అందరూ అనామకుడు అనుకుంటున్న రాజశేఖర్ మీద బిగ్ బాస్ రెండు రోజులు ఫోకస్ పెట్టే సరికి అతడు కెప్టెన్‌గా ఎంపిక కావడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో రాజ్ ఉన్నాడు. అందుకే ఇంటి సభ్యులు సానుభూతితో అతడికి ఓట్లు వేసినట్లు కనిపిస్తోంది. మొత్తం 8 మంది నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. రాజ్‌తో పాటు రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, మెరీనా-రోహిత్ కపుల్, ఫైమా, షానీ, అభినయశ్రీ ఉన్నారు. వీరిలో ఓటింగ్ పరంగా రేవంత్ తొలిస్థానంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అతడు సేఫ్ కావడం పక్కాగా కనిపిస్తోంది. ఫైమా, రోహిత్- మెరీనా కపుల్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా కంటెస్టెంట్ల మధ్య ఓటింగ్ పరంగా పెద్దగా తేడా లేకపోవడం ఉత్కంఠ రేపుతోంది. తొలివారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే కెప్టెన్ అయిన రాజ్ హౌస్ నుంచి వెళ్లిపోవడం పక్కా అని అంటున్నారు. ఇదే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చే బిగ్ ట్విస్ట్ అని చెప్పుకుంటున్నారు.
మరోవైపు డబుల్ ఎలిమినేషన్ ఉంటే గీతూ లేదా ఆదిరెడ్డిలలో ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోయే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. వివాదాలకు కేంద్ర బిందువుగా కనిపిస్తున్న గీతూను బిగ్‌బాస్ అప్పుడే బయటకు పంపే ప్రసక్తే లేదని కొందరు వాదిస్తున్నారు. అటు మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్‌లో రాజశేఖర్ పెద్దంత లైమ్ లైట్లో లేడు. ఎక్కువగా స్క్రీన్ ప్రజెన్స్ రేవంత్, గీతూ మధ్యే ఉంటూ వచ్చింది. దీంతో రాజశేఖర్ ప్రతి చోట ఆటలో అరటిపండులానే కనిపించాడు. అయితే ఆ అమాయకత్వమే చివరకు సానుభూతిగా మారి అతడు కెప్టెన్ కావడానికి కారణమైంది. టాస్కులలో పెర్ఫార్మెన్స్, జనాల ఓటింగ్ మాట ఎలా ఉన్నా బిగ్ బాస్ హౌస్‌లోని మెజారిటీ కంటెస్టెంట్స్ రాజశేఖర్ పక్షాన నిలబడటం విశేషం. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 21 మంది సభ్యుల మధ్య నిదానంగా నిప్పు రాజుకోవడం మొదలైంది. ముఖ్యంగా చలాకీ చంటి ప్రవర్తనతో సింగర్ రేవంత్ అసహనానికి గురవుతున్నాడు. ఎదుటివాళ్లపై జోక్ వేసే అతడు.. అతడిపై ఎవరైనా జోక్ వేస్తే తట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని రేవంత్ వాదిస్తున్నాడు.