
తమిళ హీరో శివ కార్తీకేయన్ క్రమంగా తెలుగులో తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఈ ఏడాది డాన్ సినిమాతో ఆకట్టుకున్న అతడు తాజాగా ప్రిన్స్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ ప్రిన్స్ మూవీని తెరకెక్కించాడు. స్టాండప్ కమెడియన్ నుంచి నటుడిగా మారి దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న శివ కార్తికేయన్ తొలిసారి నేరుగా తెలుగు సినిమా చేశాడు. తొలిరోజు ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించినా వసూళ్లు మాత్రం సంతృప్తికరంగా ఉండటంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అటు తమిళం, ఇటు తెలుగులో సేఫ్ ప్రాజెక్టుగా నిలిచే అవకాశాలున్నాయి.
ఈ చిత్రంలో శివకార్తికేయన్ స్కూల్ టీచర్ పాత్రలో నటించాడు. అతడి సరసన ఉక్రెయిన్ కు చెందిన మరియా హీరోయిన్ పాత్ర పోషించింది. హీరో తండ్రిగా సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు. ప్రిన్స్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.7 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. తొలి నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.3.5 కోట్లను రాబట్టింది. దీపావళి సెలవులు ఈ సినిమాకు అడ్వాంటేజ్ కానున్నాయి. దీంతో దీపావళి ముగిసే లోగా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం రికవరీని రాబడుతుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తెలుగులో కంటే తమిళంలో ప్రిన్స్ మూవీ ఎక్కువగా వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు తమిళ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఏకంగా ఏడు కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. తమిళంలో ఈ మూవీ రూ.32 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం అందుతోంది. అటు ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ విదేశాల్లో కూడా బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు.
ప్రిన్స్ మూవీలో ఆనంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనబరిచిన ఎంటర్టైన్మెంట్ పెర్ఫార్మన్స్, ఫన్నీ డైలాగ్స్, మరీ ముఖ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ సూపర్ గా ఉన్నాయని అభిమానులు అంటున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ప్రిన్స్ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుత పరిస్థితులలో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచననే ప్రిన్స్ కథకు స్ఫూర్తి అని దర్శకుడు అనుదీప్ వెల్లడించాడు. ఈ సినిమాను వినోదాత్మకంగా చెప్పాలని భావించామని…ఇందులో వార్ సీన్ అన్ రియల్ ఇంజన్‌ను వర్చువల్ రియాలిటీ అనే కొత్త టెక్నాలజీలో చేశామని తెలిపాడు. అటు జెస్సికా పాత్ర కోసం చాలా మందిని వెతికామని.. మారియా చాలా బాగా ఆడిషన్స్ ఇచ్చిందని.. ఆడిషన్స్ తర్వాత జెస్సికా పాత్రకు మరియా పర్ఫెక్ట్ అనిపించడంతో ఆమెను తీసుకున్నట్లు అనుదీప్ వివరించాడు. ప్రిన్స్ మూవీకి తమన్ సంగీతం సమకూర్చగా మనోజ్ పరమహంస డీవోపీ అందించాడు.