
ఈ ఏడాది టాలీవుడ్ ఖాతాలో మరో హిట్ చేరింది. ఆగస్టు నెలలో వరుసగా బింబిసార, సీతారామం, కార్తీకేయ-2 సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యి బయ్యర్లకు మంచి లాభాలను అందించాయి. అయితే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా భారీ నష్టాలను మిగల్చడంతో టాలీవుడ్ మళ్లీ నిరాశలో కూరుకుపోయింది. ఈ నెల ఆరంభంలో రంగరంగ వైభవంగా సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీంతో ఈ వారం విడుదలైన శర్వానంద్ మూవీ ఒకే ఒక జీవితంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలంగా శర్వానంద్ కూడా హిట్ అందుకోకపోవడంతో తప్పనిసరిగా ఈ సినిమా హిట్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శర్వానంద్ కెరీర్‌లో 30వ సినిమాగా ఒకే ఒక జీవితం తెరకెక్కింది. శ్రీకార్తీక్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను చాలా కాలం రూపొందించాడు. అమల అక్కినేని ఈ మూవీలో కీలక పాత్ర పోషించింది.
అయితే బ్రహ్మాస్త్ర మూవీ కారణంగా తొలిరోజు తక్కువ వసూళ్లు రాబట్టినా మౌత్ టాక్ పాజిటివ్‌గా రావడం, మంచి రివ్యూలు ఈ సినిమా రెండో రోజు నుంచి పికప్ అయ్యేందుకు దోహద పడ్డాయి. దీంతో రెండో రోజు చాలా చోట్ల ఈ మూవీకి హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. చాలా కాలం తర్వాత హీరో శర్వానంద్‌కు హిట్ అందించింది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.7 కోట్లకు కొనుగోలు చేయగా మూడు రోజుల్లోనే ఈ మొత్తం డబ్బులు వచ్చేశాయి. బింబిసార, కార్తీకేయ-2 తరహాలో మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్‌లన్నీ లాభాల కిందే జమ అవుతాయి. అమెరికాలో కూడా ఒకే ఒక జీవితం మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా సాధారణ ప్రేక్షకులను సైతం మెప్పిస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్లో అందరూ లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది. దీని కోసమే కదా సినిమాల్లోకి వచ్చామనిపించింది. ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుందనే దాన్ని అటుంచితే థియేటర్ లో చప్పట్లు వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమని ఇచ్చారు. సినిమా చూసిన అందరూ హత్తుకుంటున్నారు. ఇంతకంటే ప్రేమ ఏం కావాలి అంటూ సక్సెస్ మీట్‌లో శర్వానంద్ తన సంతోషం వ్యక్తం చేశాడు.
అయితే ఈరోజుల్లో ఓ వస్తువును తయారు చేయటం ఎంత ముఖ్యమో దాన్ని మార్కెటింగ్ చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. దీన్ని సినీ ప్రపంచానికి అన్వయిస్తే సినిమాలను రూపొందించటమే కాదు. వాటిని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లటం కూడా చాలా ముఖ్యం. ప్రమోషన్స్ విషయంలో కేర్ తీసుకోకపోతే అది కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తుందనటంలో డౌటే లేదు. ఇప్పుడు అలాంటి జాబితాలో ఒకే ఒక జీవితం సినిమా చేరింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే నెగిటివ్ టాక్ వస్తే కనీసం రూ.7కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేదా అంటే ట్రేడ్ పండితులే పెదవి విరిచేవాళ్లు. మేకర్స్ ఓవర్ సీస్ విషయంలోనూ మరో తప్పు చేశారు. మామూలుగా ఇండియా కంటే ముందుగానే యు.ఎస్‌లో ప్రీమియర్స్ షోస్ పడతాయి. సినిమా బావుంటే అక్కడ నుంచే పాజిటివ్ బజ్ మొదలవుతుంది. రివ్యూల రూపంలో వచ్చే ఔట్‌పుట్ కూడా ఇక్కడ కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందనటంలో సందేహమే లేదు. ఒకే ఒక జీవితం నిర్మాతలు యు.ఎస్‌లోనూ ప్రీమియర్స్ ఎర్లీగా వేయలేదు. దీంతో తొలిరోజు ఈ విషయం వసూళ్లపై ప్రభావం చూపింది.