
యువ నటుడు శర్వానంద్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. టాలీవుడ్లో ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు నిశ్చితార్ధానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. హీరో శర్వానంద్ త్వరలో పద్మ అనే ఎన్నారై అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న శర్వానంద్ ఎంగేజ్మెంట్ జరుగుతుందని సన్నిహితులు చెప్తున్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం పద్మ అనే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. కోవిడ్ సందర్భంగా హైదరాబాద్‌లో ఇంటి నుంచి వర్క్ చేసే సమయంలో శర్వాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. శర్వా పెళ్లి చేసుకునే అమ్మాయికి రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని కూడా టాక్ నడుస్తోంది.
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకు అతిథిగా హాజరైన శర్వానంద్ పెళ్లిపై సరదా వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ కంటే ముందే పెళ్లికొడుకుగా ముస్తాబు కానున్నాడు. ప్రస్తుతం అతడికి 38 ఏళ్లు. ఇప్పటికే పెళ్లి చేసుకోవడం లేట్ అయ్యిందని అతడి అభిమానులు భావిస్తున్నారు. టాలీవుడ్లో టాలెంట్ యాక్టర్‌గా శర్వానంద్ మంచి గుర్తింపు అందుకున్నాడు. గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల ఒకే ఒక జీవితం మూవీలో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 2003లో విడుదలైన ఐదో తారీఖు అనే సినిమాతో వెండితెర పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత చిరంజీవితో థమ్స్ అప్ యాడ్‌లో నటించడమే కాకుండా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో కలిసి సంక్రాంతి, లక్ష్మీ సినిమాల్లో నటించాడు.
కాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, శర్వానంద్ టాలీవుడ్లో మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలో శర్వానంద్ పెళ్లి కానుకగా రామ్‌చరణ్ అదిరిపోయే బహుమతి ఇస్తున్నాడని ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.3 కోట్ల విలువైన కారును శర్వాకు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ చదువుకునే రోజుల నుంచే మంచి స్నేహితులు. తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టడంతో వీరి ఫ్రెండ్షిప్ ఇంకా బలపడింది. ప్రొఫెషన్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు శర్వానంద్, రామ్‌చరణ్ రెగ్యులర్‌గా కలుస్తూనే ఉంటారు. చిరు ఇంటికి కూడా శర్వా చాలా సార్లు వెళ్లినట్లు సమాచారం. ఇటీవల శర్వానంద్ బర్త్ డే సందర్భంగా రామ్‌చరణ్ అతడి పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. శర్వా చేత దగ్గరుండి మరీ కేక్ కట్ చేయించాడు. ఈ ఫొటోలను శర్వానంద్ తన ట్విట్టర్లో షేర్ చేసి గ్రేట్ పార్టీ ఏర్పాటు చేసినందుకు రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పాడు.