
సుడిగాలి సుధీర్ అనగానే జబర్దస్త్ కామెడీ షోనే గుర్తుకువస్తుంది. ఈ షో ద్వారా స్టార్‌గా ఎదిగిన నటుల్లో సుధీర్ ఒకడు. కమెడియన్‌గా ఒక టీంలో కంటెస్టెంట్‌గా ప్రయాణం ప్రారంభించిన సుడిగాలి సుధీర్ కొద్దికాలంలోనే సినిమా ఇండస్ట్రీలో హీరోగా చలామణి అవుతున్నాడు. తాను సినిమాల్లో హీరో అయినప్పటికీ జబర్దస్త్ కామెడీ షోను మర్చిపోకుండా చాలాకాలం టీం లీడర్‌గా కొనసాగాడు. కానీ స్టార్ మా నుంచి అదిరిపోయే ఆఫర్ రావడంతో జబర్దస్త్‌ను వదిలేసి అక్కడికి వెళ్లిపోయాడు. అయితే స్టార్ మాకు కేవలం తాత్కాలికంగా మాత్రమే వెళ్లానని.. ఇప్పుడు అక్కడ పనేమీ లేదని, తనకు కొన్ని సినిమా కమిట్మెంట్స్ వల్ల మల్లెమాలకు దూరమయ్యానని సుధీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో సుధీర్ మళ్లీ జబర్దస్త్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.
కట్ చేస్తే జబర్దస్త్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో హైపర్ ఆది కూడా ఉంటాడు. అతడి పంచ్‌లు ఈ కామెడీ షోకు హైలెట్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు అతడు రాజకీయం వైపు అడుగులు వేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ అంటే అభిమానించే ఆది ఇటీవల జనసేన పార్టీకి జై కొట్టాడు. గతంలో రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా ఇప్పుడు మళ్లీ జనసేన కోసం పనిచేస్తున్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో జనసేన నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులపై కౌంటర్లు వేశాడు. కొంతమంది మంత్రులకు వాళ్ల శాఖలు కూడా తెలియదని ఎద్దేవా చేశాడు. మంత్రులు ఆ శాఖ.. ఈ శాఖ కాకుండా పవన్ కళ్యాణ్‌ను తిట్టేందుకు ఓ శాఖ పెట్టుకోవాలని చురకలు అంటించాడు. అంతేకాదు గత ఎన్నికల్లో హైపర్ ఆది ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరపున ప్రచారం చేశాడు.
అయితే ఇప్పుడు జగన్ పార్టీ హైపర్ ఆదికి కౌంటర్‌గా సుడిగాలి సుధీర్‌ను రంగంలోకి దింపుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైపర్ ఆది తరహాలో సుడిగాలి సుధీర్ కూడా రాజకీయాల వైపు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుధీర్‌కు మొదట్నుంచీ జగన్ అంటే ఇష్టమని.. దీంతో అతడు వైసీపీలో చేరతాడని టాక్ నడుస్తోంది. హైపర్ ఆదికి కౌంటర్‌గానే వైసీపీ సుడిగాలి సుధీర్‌ను రంగంలోకి దింపుతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలో పలువురు సినిమా యాక్టర్లకు మంచి పదవులు లభించాయి. పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వీ, అలీ, సింగర్ మంగ్లీ వంటి ప్రముఖులకు జగన్ ప్రభుత్వం పదవులను కట్టబెట్టింది. ఇప్పుడు సుధీర్ పార్టీలోకి వస్తే అతడికి కూడా ప్రాధాన్యం ఇస్తుందని అతడి అభిమానులు భావిస్తున్నారు. అటు మంత్రి రోజా హైపర్ ఆది కి కౌంటర్లు వేయాల్సిందిగా కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులను ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాలు, షోలు వదిలేసి మంత్రి రోజా సాన్నిహిత్యం కారణంగా సుడిగాలి సుధీర్ రాజకీయాల వైపు వెళ్తాడా లేదో కాలమే సమాధానం చెప్పాలి.