
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. విశాఖలో జరిగిన ఘటన కారణంగా జనసేన పార్టీ అధికార పార్టీ వైసీపీపై యుద్ధభేరి మోగించింది. విశాఖలో జరిగిన అన్యాయానికి జనసేన పార్టీకి అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్‌ను కలిసి చర్చించారు. ప్రజాస్వామ్యం బతికించుకోవాలంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున మార్పుని కోరుకుంటున్నారు. అందుకే ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి వారి పరిపాలన ఏ విధంగా ఉందో చూడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో చంద్రబాబుకు కాకుండా జగన్‌కు అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు కూడా ఒక అవకాశం ఇస్తే ఆయన పరిపాలన విధానం ఏ విధంగా ఉంటుందో చూడాలని పలువురు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఫిలింనగర్ సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటిని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని.. ప్రజలకు ఇలాంటి నాయకుడు అవసరం అంటూ పవన్ కళ్యాణ్ గురించి తారక్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడినట్లు కూడా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి పవన్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడం అటు టీడీపీ, ఇటు జనసేనలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం టీడీపీ వ్యవహారాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే వచ్చేలా కనిపించడం లేదు. అందుకే తన సహచరుడిని అయినా సీఎంగా చూడాలని ఎన్టీఆర్ ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. అటు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పవన్ కళ్యాణ్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఆ పార్టీ క్లోజ్ కావడం ఖాయమని.. అలా కాకుండా టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ మునిగిపోతుందని.. ఎందుకంటే చంద్రబాబు వయసు అయిపోయిందని పలువురు భావిస్తున్నారు. ఆయనకు గతంలో తరహాలో శక్తి సామర్థ్యాలు లేవని..లోకేష్ పెద్ద నాయకుడు కాలేడని అభిప్రాయపడుతున్నారు. దీంతో జనసేన టీడీపీతో కలిసినా వచ్చే నష్టం ఏమీ ఉండదని.. టీడీపీలో పేరుకే చంద్రబాబు, పరిపాలన అంతా లోకేష్ చూస్తున్నాడని.. ఒక మనిషి తన జీవితం అంతా ఒకే విధంగా పని చేయలేడని.. అందుకే పవన్ అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు క్రికెటర్ విరాట్ కోహ్లీని తీసుకుంటే అతడు చురుగ్గా ఉన్నా కెప్టెన్సీ పగ్గాలు రోహిత్‌కు అప్పగించాడని.. అలాగే చంద్రబాబు కూడా తన కూటమి గెలిచినా పవన్‌ను సీఎం చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరితో పొత్తు పెట్టుకున్నా జనసైనికులు వేరేవాళ్లతో విభేదించకుండా ఆయన వెంటే నడవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.