
ఉదయ్ కిరణ్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ముందుగా గుర్తుకొచ్చే సినిమా ‘చిత్రం’. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే ట్రెండ్ సెట్టర్ సృష్టించాడు. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ మరోసారి తేజ దర్శకత్వంలో నువ్వు నేను అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మూడో సినిమా కూడా ప్రతిష్టాత్మక బ్యానర్‌లోనే చేశాడు. అప్పట్లో మంచి ఫామ్‌లో ఉన్న సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మనసంతా నువ్వే సినిమాలో నటించాడు. స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు ఈ మూవీని నిర్మించాడు. ఇది కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తొలి మూడు సినిమాలు హ్యాట్రిక్ స్థాయిలో విజయం సాధించడంతో ఉదయ్ కిరణ్ పేరు మార్మోగిపోయింది. అమ్మాయిల్లో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26న హైదరాబాద్‌లో జన్మించాడు. తెలుగు, తమిళ భాష చిత్రాల్లో పలు సినిమాల్లో నటించాడు. తొలి మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు హిట్ కాలేకపోయాయి. కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీకు నేను నాకు నువ్వు వంటి సినిమాలు సక్సెస్ సాధించలేకపోయాయి. ఎంఎస్ రాజు బ్యానర్‌లోనే మరోసారి నటించిన నీ స్నేహం సినిమా ఓ మాదిరిగా ఆడింది. 2001లో నువ్వు నేను సినిమాకు ఉదయ్ కిరణ్‌కి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. 2005లో పాయ్ అనే సినిమా ద్వారా బాలచందర్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ తమిళ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. అనంతరం కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సినిమాలు విడుదల కాలేదు. అయితే ఉదయ్ కిరణ్ ఎంత ఎత్తుకు ఎదిగాడో అంత కిందికి పడిపోయాడు. సినిమా అవకాశాలు రాక మానసికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయి మనస్థాపానికి గురై చివరకు సూసైడ్ చేసుకున్నాడు.
అయితే మనసంతా నువ్వే సహా పలు సినిమాల్లో తల్లి పాత్రలో నటించిన సుధను ఉదయ్ కిరణ్ నిజంగానే తల్లిగా భావించేవాడు. ఇటీవల నటి సుధ ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ అందరి లాంటి వాడు కాదని.. తనను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నా ఎవ్వరికీ కూడా చెప్పుకోకుండా లోలోపలే బాధను అనుభవించి ఉంటాడని సుధ అభిప్రాయపడింది. అందుకే సూసైడ్ చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. ఎవరైనా ఓదార్చినప్పుడు మాత్రమే మంచిగా ఉండేవాడు అని.. ఆ తరువాత మళ్లీ బాధపడేవాడని గుర్తుచేసుకుంది. ఉదయ్ కిరణ్ మరణించడానికంటే రెండు నెలల ముందు తాను దత్తత తీసుకోవాలనుకున్నానని.. కానీ అనివార్య కారణాల వల్ల తీసుకోలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఉదయ్ కిరణ్ మరణించడానికి ముందు చివరి రోజుల్లో తన దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకుని గట్టిగా ఏడ్చాడని.. తాను ఒంటరి వాడిని అయ్యానని కన్నీటి పర్యంతమయ్యాడని.. అయితే తాను మంచి వ్యాపారం చూపిస్తానని ధైర్యం చెప్పానని సుధ చెప్పింది.