
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల అవార్డులను అందుకుంటోంది. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రాగా తాజాగా ఇదే పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు నామినేట్ అయ్యింది. ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) సినిమాలు కూడా నామినేట్ అయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు పాట సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణి, లిరిక్స్ అందించిన చంద్రబోస్ పేర్లను ఆస్కార్ అకాడమీ ప్రచురించింది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి ఆలపించారు. ఈ నేపథ్యంలో 95వ ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో నామినేషన్ సాధించిన తొలి దక్షిణ భారతీయ చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ మూవీ రికార్డు క్రియేట్ చేసింది.
ఆస్కార్ నామినేషన్స్‌కు ఆర్.ఆర్.ఆర్ మూవీ ఎంపిక కాగానే దేశమంతటా హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు ఎవరిని వరిస్తుందనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించగా ఇప్పుడు అవార్డు వస్తే ఎవరిని వరిస్తుందనే విషయంపై అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కొందరు ఈ మూవీలో అద్భుత నటనకు ఎన్టీఆర్‌కు అవార్డు వస్తుందని అంటుంటే.. మరికొందరు మాత్రం తమ మెగా హీరో రామ్‌చరణ్‌కే వస్తుందని భావిస్తున్నారు. ఏదేమైనా ఈ చిత్రానికి అవార్డు వస్తే దేశమంతటా గర్విస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్లు సాధించిన ఇతర భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1957), సలామ్ బొంబాయి (1988), లగాన్ (2001) ఉన్నాయి. కానీ ఫైనల్ అవార్డు మాత్రం గెలవలేకపోయాయి. అయితే నాటు నాటు మిగతా నాలుగు పాటలతో పోటీ ఆస్కార్‌ను సాధిస్తుందా లేదా అనేది మార్చి 13న తెలుస్తుంది. ఈ పాటతో పాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విష్పర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ ఆల్ ది బ్రీత్స్ ఇలా మూడు విభాగాల్లో ఇండియన్ సినిమాలు నామినేట్ అయ్యాయి.
మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కూడా అకాడమీ అవార్డుల్లో నామినేట్ అయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే ఆయన పేరు లీడ్ యాక్టర్ కేటగిరిలో నామినేట్ కాలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఎన్టీఆర్‌కు బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ పొందే ఆస్కారం ఉందని ప్రముఖ అమెరికన్ పబ్లికేషన్ యుఎస్‌ఎ టుడే ప్రచురించింది . నటుడు జూనియర్ ఎన్టీఆర్ టాప్ ఆస్కార్ పోటీదారుగా ఉండబోతున్నాడని జోస్యం చెప్పింది. అయితే అలాంటిదేమి జరగలేదు. కాగా ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లిస్టులో నాటు నాటు పాట చోటు దక్కించుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి టీమ్‌కు అభినందనలు తెలియజేశారు. మైలురాయికి అడుగు దూరంలో ఉన్నామంటూ ట్వీట్ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి టీమ్‌కు ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పారు. అటు తాను నటించిన సినిమాలోని పాట ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోవడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ పాట ఎప్పటికీ తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని చెప్పాడు. ఈ ఘనత సాధించిన కీరవాణి, చంద్రబోస్‌కు కంగ్రాట్స్ తెలియజేశాడు. కాగా వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్‌లిస్ట్ కాగా.. అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాల్ని ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాను ఎంపిక చేశారు. ఉత్తమ సినిమా విభాగంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా నామినేట్ అవుతుందన్న ఆశలు మాత్రం నీరుగారిపోయాయి.