
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన వీరసింహారెడ్డి మంచి ఓపెనింగ్స్ సాధించింది. మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా కంటే తొలిరోజు వీరసింహారెడ్డి మూవీనే ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అయితే టాక్ కారణంగా రెండో రోజు నుంచే వసూళ్లు భారీగా పడిపోయాయి. యాక్షన్ ఎక్కువగా ఉండటం, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడంతో ఈ సినిమా వసూళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ఈ సినిమా మొదటి వారం పూర్తి చేసుకుంది. తొలివారం వీరసింహారెడ్డి రూ.68 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరుకోలేదు. ఈ సినిమా రూ.73 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేయగా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా రూ. 5.49 కోట్ల షేర్ రాబట్టాలి.
అయితే రెండో వారం ఇతర సినిమాలు లేకపోవడంతో వీరసింహారెడ్డి బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. సంక్రాంతి సెలవులు ముగియడంతో ఈ మూవీకి వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. తొలిరోజు సంచలన కలెక్షన్స్ రాబట్టినా కూడా వీరసింహారెడ్డిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇవే లేకపోతే వీరసింహారెడ్డి ఇంకా పెద్ద విజయం సాధించేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సినిమాలో ఇంత పెద్ద తారాగణం ఉన్నా కూడా హీరోయిన్ శృతిహాసన్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అభిమానులు అంటున్నారు. శృతిహాసన్ పాత్రను మలచిన తీరు చాలా మందికి నచ్చలేదు. సినిమాలో ఇద్దరు బాలకృష్ణలు ఉన్నారు. పెద్ద బాలకృష్ణ పాత్రకి ఇచ్చిన ప్రాధాన్యత చిన్న బాలకృష్ణ కి దక్కలేదు అంటున్నారు. మలయాళీ భామ హనీ రోజ్‌కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఆమెని కేవలం ఒక పాట కి మాత్రమే పరిమితం చేశారు. అందులోనూ ఆమెకు కొన్ని స్టెప్స్ మాత్రమే ఇచ్చారు.
వీరసింహారెడ్డి సినిమా ఏడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే. తెలంగాణలో రూ. 15.37కోట్లు.. సీడెడ్ ఏరియాలో రూ. 15.23 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.41 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 4.94 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 3.76 కోట్లు, గుంటూరులో రూ. 5.97 కోట్లు, కృష్ణాలో రూ. 4.24 కోట్లు, నెల్లూరులో రూ. 2.59 కోట్లు వసూళ్లు వచ్చాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కాకుండా రెస్టాఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ వసూళ్లు కలుపుకుని మొత్తం రూ. 68.51కోట్లు షేర్ సాధించింది. బాలయ్య కెరీర్‌లోనే ఈ మూవీకి ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.35 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 31.05 కోట్ల షేర్, రూ. 50.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని ఖాతాలో మరో హిట్ చేరుతుందో లేదో కొద్దిరోజుల్లో తేలిపోనుంది.