
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి చేసుకుని హాయిగా వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నాడు. చెక్, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో అతడు ఓ సినిమాలో నటిస్తున్నాడు. భీష్మ సినిమా తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రాబోతున్న రెండో మూవీ ఇది. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ కాగా త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో నితిన్ పాత్ర వెరైటీగా ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ మూవీలో నితిన్ భార్యకు విడాకులు ఇచ్చిన భర్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. భార్యతో విభేదాల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చి దూరంగా ఒంటరిగా బతికే భర్త పాత్రలో నితిన్ నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో నితిన్ నిజ జీవితంలో విడాకులు తీసుకున్నట్లు కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల పలువురు స్టార్లు విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో నితిన్ విడాకుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో 2002లో తెలుగు ఇండస్ట్రీకి నితిన్ పరిచయం అయ్యాడు. అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. జయం తర్వాత కొన్ని సినిమాలు ప్లాప్ అయినప్పటికీ… నితిన్ నటించిన దిల్, ఇష్క్ , గుండెజారి గల్లంతైందే.. వంటి సినిమాలు అతడికి మంచి పేరుతెచ్చి పెట్టాయి. 2020లో నితిన్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. 2020, జూలై 26న షాలిని అనే చిన్న నాటి స్నేహితురాలిని నితిన్ పెళ్లి చేసుకున్నాడు. కరోనా సమయంలో పెళ్లి కావడంతో కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే నితిన్ పెళ్లి జరిగింది. ఇటీవల నితిన్-షాలిని జంట రెండో వివాహ వార్షికోత్సవం జరుపుకుంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉండేదో ఈ ఇంటర్వ్యూ ద్వారా నితిన్ తెలియజేశాడు. పెళ్లి తరవాత తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని నితిన్ తెలిపాడు. పెళ్లికాకముందు సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఇంటికి వచ్చి షాలినితో ఫోన్ మాట్లాడుతూ రిలాక్స్ అయ్యే వాడినని.. పెళ్లి తర్వాత ఇంటికి తిరిగొచ్చిన తర్వాత షాలిని కంపెనీని వీడలేకపోతున్నానంటూ వివరించాడు.
వెంకీ కుడుములతో నితిన్ నటించబోయే సినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించబోతున్నట్లు సమాచారం అందుతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భీష్మ సినిమాను మించిన సూపర్ హిట్ తీయాలని వెంకీ కుడుముల కూడా ప్రయత్నిస్తున్నాడు. అటు హీరో నితిన్‌కు ఈ సినిమా ఫలితం ఎంతో ముఖ్యమైనదని చెప్పాలి. గత మూడు సినిమాలతో అభిమానులను నిరాశపరిచిన అతడు వెంకీ కుడుములతో తీయబోయే మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మాచర్ల నియోజకవర్గం మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయం చవిచూసింది. తాజాగా ఈ మూవీ ఈనెల 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో నిరాశపరిచిన ఈ మూవీని ఓటీటీలో ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి.