
టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. తనదైన నటనతో వరుసగా క్రేజీ ప్రాజెక్టులను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. తాజాగా సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఖుషి అనే సినిమాలో విజయ్ నటిస్తున్నాడు. నిన్నుకోరి, మజిలీ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ ఈ ఖుషి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఖుషి సినిమా టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టడంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇటీవల ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను కాశ్మీర్‌లో తెరకెక్కించారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు శివ నిర్వాణ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. దాదాపు 20 రోజుల పాటు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ జరిగింది.
కాశ్మీర్ వేదికగా తెరకెక్కించిన షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్, సీనియర్ నటి శరణ్యలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయ్, సమంత గాయపడినట్లు వార్తలు వచ్చాయి. కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు వీరిద్దరూ లిడ్డర్ నదికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపాల్సి వచ్చిందని.. ఈ సీన్ చేస్తున్నప్పుడు వాహనం నీటిలో పడటంతో వీరికి గాయాలైనట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ఘటన గురించి ఖుషి సినిమా టీమ్ స్పందించింది. షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, సమంతలకు గాయాలైనట్లు వస్తున్న వార్తలను దర్శకుడు శివ నిర్వాణ ఖండించారు. 30 రోజుల సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అందరూ సేఫ్‌గా హైదరాబాద్ చేరుకున్నట్లు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఆయన ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.
కాగా ఖుషి సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 23న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జూన్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్‌తో సమంతకు ఇది రెండో సినిమా. గతంలో కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో వీరిద్దరూ జంటగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణతోనూ సమంతకు రెండో సినిమా కావడం విశేషం. గతంలో నాగచైతన్యతో శివ నిర్వాణ తెరకెక్కించిన మజిలీ సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించింది. ఆ సినిమాలో చైతూ, సమంత రొమాన్స్ ఆకట్టుకుంది. కాగా హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ ఆగస్టులో విడుదల కానుంది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే విజయ్ దేవరకొండ పూరీ దర్శకత్వంలో జనగనమణ అనే సినిమాను కూడా చేస్తున్నాడు.