
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా ద్వారా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే అంతకుముందే రాంగోపాల్ వర్మ రక్తచరిత్రతో తెలుతు తెరకు పరిచయం అయినా ఈగతో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఈగ మూవీ తర్వాత సుదీప్ నటించిన ఎన్నో కన్నడ సినిమాలు డబ్బింగ్ పూర్తి చేసుకుని తెలుగులో విడుదలైనా వాటిని జనాలు పట్టించుకోలేదు. చాన్నాళ్ల తర్వాత సుదీప్ నటించిన విక్రాంత్ రోణ అనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ 2డీ ఫార్మాట్‌తో పాటు 3డీ ఫార్మాట్‌లోనూ విడుదలైంది. గురువారం విడుదలైన ఈ మూవీని కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మొత్తానికి పాన్ ఇండియా సినిమాతో సుదీప్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
అడ్వంచర్, విజువల్ వండర్ ఫిలింగా విక్రాంత్ రోణ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాలకు తగ్గట్లుగానే ఈ మూవీ తెలుగులోనూ మంచి వసూళ్లను అందుకుంది. ఏపీ, తెలంగాణలో ఈ మూవీ 1.25 కోట్ల బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్‌కు చేరాలంటే రూ. 1.50 కోట్లు వసూళ్లు రాబట్టాలి. అయితే తొలిరోజే ఈ మూవీ రూ.కోటి షేర్ రాబట్టింది. అంతేకాకుండా మూడు రోజుల్లోనే రూ.2.5 కోట్లు రాబట్టి ప్రాఫిట్ వెంచర్‌గా రికార్డు సృష్టించింది. ఫుల్ రన్‌లో టాలీవుడ్‌లో రూ.6 కోట్లు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే తొలి మూడు రోజుల్లో ఈ మూవీ రూ.45 కోట్లు రాబట్టింది. కన్నడలో మంచి వసూళ్లను సాధిస్తోంది. మిక్సుడ్ టాక్‌తో కూడా విక్రాంత్ రోణ సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తొలిరోజు ఈ మూవీ తెలంగాణలో రూ. 41 లక్షలు.. రాయలసీమలో రూ. 12 లక్షలు.. ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు.. ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు.. గుంటూరులో రూ. 10 లక్షలు.. కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో 5 లక్షలు మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కలిపి రూ. 1.02 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.
విక్రాంత్ రోణ మూవీని దర్శకుడు అనూప్ బండారి తెరకెక్కించాడు. ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించింది. నిరూప్ బండారి, నీత అశోక్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ ఈ విజువల్ వండర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సంగీత దర్శకుడు బి అంజనీష్ లోకనాథ్ అద్భుతమై మ్యూజిక్ అందించాడు. కన్నడలో కేజీఎఫ్-2 తర్వాత భారీస్థాయిలో విడుదలైన మూవీ ఇదే కావడం గమనార్హం. జీ స్టూడియోస్ వారు ఈ సినిమా ప్రొడక్షన్ లో పార్టనర్ గా ఉన్నారు. అంటే జీ 5 కు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ఉన్నాయన్నమాట. 4-6 వారాల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. నిజానికి ఈ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ మేకర్స్ ఓటీటీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. త్రీడీలో ప్రేక్షకులకు మంచి అనుభూతి అందించేందుకు థియేటర్లలోనే విడుదల చేయాలని తాము నిర్ణయం తీసుకున్నామని.. అందుకే ఓటీటీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు దర్శకుడు అనూప్ బండారి వెల్లడించాడు.