
లోకనాయకుడు కమల్‌హాసన్ చాన్నాళ్ల తర్వాత భారీ హిట్ అందుకున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ విక్రమ్ అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచే ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ సినీ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తోంది. దీంతో అభిమానులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. టిక్కెట్ రేట్లు కూడా అందుబాటులో ఉండటంతో ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. విశ్వరూపం-2 తర్వాత కమల్ చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాల నిర్మాణం మొదలైనా వివిధ దశల్లో ఆగిపోయాయి. దీంతో విక్రమ్ సినిమాను చూసేందుకు కమల్ అభిమానులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని యువ హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ తరఫున సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.
థియేటర్లలో దుమ్మురేపుతున్న విక్రమ్ మూవీ త్వరలోఓటీటీలో వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ విడుదల కాకముందే శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా, డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మూడు వారాల తర్వాత విక్రమ్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అంటే జూలై మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. భారీ ధరకు విక్రమ్ మూవీ ఓటీటీ హక్కులను దక్కించుకున్న స్టార్ గ్రూప్ సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసి ఆదరణ పొందాలని ప్రయత్నాలు చేస్తోంది. 1986లో వచ్చిన ‘ఏజెంట్ విక్రమ్’ లోని కమల్ హాసన్ పాత్రను పొడిగిస్తూ వచ్చిన సినిమానే విక్రమ్. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రివెంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. త్వరలో విక్రమ్-3 కూడా ఉంటుందని తెలుస్తోంది. కార్తీ నటించిన ఖైదీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ విక్రమ్ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. కమల్‌హాసన్ కెరీర్‌లో రూ.100 కోట్ల గ్రాసర్ చేసిన మూడో సినిమా రికార్డుల్లో నిలిచింది.
గతంలో కమల్‌హాసన్ నటించిన దశావతారం, విశ్వరూపం సినిమాలు రూ.100 కోట్ల వసూళ్లు సాధించాయి. మరోవైపు ఐదు రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లను సాధించడం రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. అత్యంత వేగంగా 200 కోట్లు సాధించిన తమిళ ఐదు చిత్రాల్లో విక్రమ్ ఒకటిగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌ను కమల్ హాసన్ తన టీమ్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు లెక్సస్ కారును బహుమతిగా ఇచ్చారు. అలానే దర్శకత్వ శాఖలో పని చేసిన 13 మందికి అపాచీ ఆర్‌టిఆర్ 160 బైకులను బహుమతిగా ఇచ్చారు. తాజాగా హీరో సూర్యకు రోలెక్స్ వాచీని కమల్ బహుమతి ఇచ్చాడు. విక్రమ్ సినిమాలో నటుడు సూర్య రోలెక్స్ అనే పాత్రలో కనిపించడం విశేషం. అటు అమెరికాలో విక్రమ్ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అమెరికాలో ఈ సినిమాకు భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం 5వ రోజు 357 లొకేషన్లలో 110వేల డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 2 మిలియన్ల డాలర్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు అమెరికాలో 2,004,271 డాలర్లు రాబట్టింది.