
తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు. ఈ సినిమా తొలుత తమిళంలో వారిసు పేరిట ఈనెల 11న విడుదలైంది. తెలుగులో మాత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు భారీ స్థాయిలో విడుదల కావడంతో నిర్మాత దిల్ రాజు కొంచెం వెనక్కి తగ్గాడు. దీంతో మూడు రోజులు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. అయితే ఇదే ఈ సినిమాకు మైనస్‌గా మారింది. తమిళంలో టాక్ యావరేజ్ అని రావడంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాన్ని చేతులారా దూరం చేసుకుంది. పండగ సెలవులు కావడం, కుటుంబ కథా చిత్రం అని టాక్ రావడంతో ఓ వర్గం ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో వారసుడు మూవీ తొలి మూడు రోజుల్లో రూ.8 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి.
మరోవైపు తమిళంలో మాత్రం వారిసు మూవీ భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు వారిసు ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుందని ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. అంటే రూ.76 కోట్ల షేర్ వసూలు చేసింది. విజయ్ కెరీర్‌లో 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. విజయ్, శరత్ కుమార్, జయసుధ లాంటి నటీనటుల ప్రతిభ, విజువల్స్ బాగుండటం వారసుడు మూవీకి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. విజయ్ తండ్రిగా శరత్ కుమార్, తల్లిగా జయసుధ నటించారు. కిక్ శ్యామ్, జై, విజయ్ అన్నదమ్ములుగా కనిపించడం కూడా అభిమానులకు నచ్చింది.
విజయ్ వారసుడు సినిమా రూ.15 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో సంక్రాంతి బరిలోకి దిగింది. మూడు రోజుల కలెక్షన్స్ తర్వాత ఇంకా ఈ సినిమా రూ.7 కోట్ల రేంజ్‌లో షేర్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే అంత మొత్తం చేయకపోవచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు. పండగ సెలవులు ముగిశాక వారసుడు మూవీ వసూళ్లలో గణనీయంగా మార్పు కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వీరసింహారెడ్డి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. సంక్రాంతి విన్నర్‌గా వాల్తేరు వీరయ్య నిలవడంతో ఆ సినిమాకు ఎక్కువ స్క్రీన్‌లు లభిస్తున్నాయి. వారసుడు సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ ఇలాంటి కథ తెలుగులో ఇప్పటికే చాలా సార్లు రావడం ఒక కారణం మైనస్ పాయింట్‌గా మారిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా విజయ్‌కు తెలుగులో అంతగా పాపులారిటీ లేకపోవడం కూడా ఓ కారణమని స్పష్టం చేస్తున్నారు. ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీలో విడుదల చేశారు. ఈ సినిమా టోటల్ బడ్జెట్ సుమారు 250 కోట్ల రూపాయలు అని ప్రచారం జరుగుతోంది.