
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. వింటేజ్ మెగాస్టార్‌ను ఆవిష్కరిస్తూ రొటీన్ కథతో రూపొందిన ఈ సినిమాకి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఫెస్టివల్ వీకెండ్ అడ్వాంటేజ్‌ను పర్ఫెక్టుగా క్యాష్ చేసుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 108 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే నాలుగు రోజుల్లో ఓవరాల్‌గా రూ. 73.13 కోట్ల షేర్ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు నివేదించాయి.
దీంతో చిరంజీవి బాక్సాఫీస్ ప్రత్యర్థి నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అఖండ మూవీ ఫైనల్ వసూళ్లను వాల్తేరు వీరయ్య సినిమా కేవలం 4 రోజుల్లోనే క్రాస్ చేసిందని చెప్పొచ్చు. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో తెరకెక్కిన అఖండ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్ల వరకూ షేర్ వసూలు చేయగా.. ఇప్పుడు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నాలుగు రోజుల్లోనే బీట్ చేసింది. అయితే అఖండ సినిమా విడుదలైనప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ, తక్కువ టికెట్ రేట్లతో మాత్రమే ఆ సినిమా రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య మూవీ మాత్రం అధిక టికెట్ ధరలతో భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి సుమారు రూ. 86 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. రూ. 87 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.
అయితే కేవలం 4 రోజులు పూర్తయ్యేసరికి వాల్తేరు వీరయ్య మూవీ రూ. 73 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ట్రెండ్ చూస్తుంటే ఈ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ అవసరమైన రూ. 14 కోట్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే సంక్రాంతి రేసులో పోటీగా నిలిచిన వీర సింహా రెడ్డి చిత్రంపైనా వాల్తేరు వీరయ్య ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. బాలకృష్ణ సినిమా నాలుగు రోజుల్లో 104 కోట్ల గ్రాస్ రాబడితే, చిరంజీవి చిత్రం మూడు రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఓవర్ సీస్లోనూ నటసింహాపై మెగాస్టార్ పైచేయి సాధించారు.. ఈ పండక్కి విన్నర్‌గా నిలిచారు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రెండింటిలోనూ శృతి హాసన్ హీరోయిన్గా నటించడం గమనార్హం. వీరసింహారెడ్డి మూవీకి తమన్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ కాగా వాల్తేరు వీరయ్య మూవీకి దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో పాటలు అందించి సక్సెస్‌కు కారణమయ్యాడు.