
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీర సింహా రెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రివ్యూలు కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ తొలి రోజు టాక్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే రెండో రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద డ్రాప్స్ కనిపించడంతో.. ఐదు రోజులు ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 56 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడం, ‘క్రాక్’ విజయం తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం కావడంతో మొదటి నుంచే ట్రేడ్ లో ‘వీర సింహా రెడ్డి’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగానే వీరసింహారెడ్డి మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా.. 5 రోజుల్లో రూ. 56 కోట్లు వసూలు చేసింది. అందులో యూఎస్‌లో 1 మిలియన్ కు పైగా గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోడానికి ఈ సినిమా ఇంకా 18 కోట్ల వరకూ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉందని తెలుస్తోంది. అయితే రోజు రోజుకు పడిపోతున్న వసూళ్లు చూసి బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనా? అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో నడుస్తోంది. బాలయ్య మార్క్ మాస్ అండ్ యాక్షన్ కు సిస్టర్ సెంటిమెంట్‌ను కలబోసి వీర సింహా రెడ్డి చిత్రాన్ని రూపొందించాడు గోపీచంద్ మలినేని. బాలకృష్ణను డ్యూయల్ రోల్ లో చూపించడమే కాదు.. సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశాడు.
మరోవైపు నందమూరి ఫ్యాన్స్ కోరుకునే భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మాస్ ఫీస్ట్‌ను అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. అయితే ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని విశ్లేషిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే కలెక్షన్స్‌లో భారీ డ్రాప్స్ కనిపించాయి. అయితే మేకర్స్ మాత్రం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లోనే రూ. 104 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా అధికారిక పోస్టర్ తో ప్రకటించారు. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. వీర సింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్‌లుగా నటించారు. తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ – కన్నడ నటుడు దునియా విజయ్ – మలయాళ నటుడు లాల్ కీలక పాత్రలు పోషించారు. చంద్రికా రవి ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఎస్. తమన్ సంగీతం సమకూర్చాడు.